ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!

- August 28, 2026 , by Maagulf
ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!

సలాలా: ఒమన్‌లో ఖరీఫ్ సీజన్ సందర్భంగా ధోఫార్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్న నేపథ్యంలో అత్యవసర రక్షణ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.  ఖరీఫ్ సీజన్‌తో ధోఫార్ గవర్నరేట్ పచ్చని అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, సందర్శకుల భద్రత కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సమగ్ర అత్యవసర స్పందన ప్రణాళికను అమలు చేస్తోంది. పర్యాటకుల రద్దీతో పాటు సహజ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాల కోసం ప్రత్యేక బృందాలను పూర్తి అప్రమత్తతతో సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యేక బృందాల సేవలు ఇప్పటికే ప్రాణాలను కాపాడుతున్నాయని ధోఫార్‌లోని CDAA యూనిట్ అసిస్టెంట్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ బిన్ ముసల్లం అల్ అమ్రీ తెలిపారు. ఇటీవల కఠినమైన పర్వత మార్గంలో హైకింగ్ చేస్తూ అత్యవసర పరిస్థితికి గురైన 51 ఏళ్ల వ్యక్తిని ప్రత్యేక బృందాలు రక్షించాయి. మరో ఘటనలో నీటి ఊటలో మునిగిపోతున్న 9 ఏళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఖరీఫ్ సమయంలో తమ సిబ్బంది ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రమాదాల వైవిధ్యాన్ని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని అల్ అమ్రీ పేర్కొన్నారు. వేగవంతమైన స్పందన, సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించడం, ప్రజలు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు.

ప్రధాన రహదారుల వెంట ప్రత్యేక కేంద్రాలు

రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయాన్ని తగ్గించేందుకు ధోఫార్‌కు వెళ్లే ప్రధాన రహదారుల వెంట అధునాతన ఆపరేటింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటక ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే కాకుండా, ప్రయాణికులు ధోఫార్ వైపు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే అత్యవసర రక్షణ సేవల పరిధిలోకి వస్తారు. ధోఫార్‌లో భౌగోళిక పరిస్థితులు, సందర్శకుల రద్దీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రమాదాల ఆధారంగా సిబ్బంది, పరికరాలను అవసరానికి అనుగుణంగా మోహరిస్తున్నారు.

బీచ్‌లు, జలపాతాలు, పర్వత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు

అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక వాటర్ రెస్క్యూ, మౌంటెన్ సెర్చ్ బృందాలను అందుబాటులో ఉంచారు.బీచ్‌లు, సహజ నీటి ఊటలు, జలపాతాలు, పర్వత మార్గాలు, ఎత్తైన కొండచరియలు, ప్రముఖ హైకింగ్ ట్రైల్స్,  వినోద కేంద్రాలు, ఫెస్టివల్ ప్రాంతాలలో ప్రత్యేక రెస్క్యూ టీమ్స్ ను అందుబాటులో పెట్టినట్లు తెలిపారు.  

ఖరీఫ్ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, అధిక అలలు, బలమైన నీటి ప్రవాహాలు వంటి పరిస్థితుల కారణంగా నీటి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటర్ రెస్క్యూ బృందాలకు ప్రత్యేక పడవలు, శిక్షణ పొందిన డైవర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనుమతి లేని లేదా నిషేధిత ప్రాంతాల్లో ఈతకు వెళ్లవద్దని లెఫ్టినెంట్ కల్నల్ అల్ అమ్రీ ప్రజలను కఠినంగా హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులను పాటించడమే మునిగిపోయే ప్రమాదాలను నివారించేందుకు తొలి రక్షణ చర్య అని తెలిపారు.

హోటళ్లు, కేఫ్‌లలో భద్రతా తనిఖీలు

అత్యవసర పరిస్థితులకు స్పందించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలపైనా అధికారులు దృష్టి పెట్టారు. వాణిజ్య, నివాస, పర్యాటక ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హోటళ్లు, కేఫ్‌లు, ఈవెంట్ వేదికల్లో అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఇతర భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తున్నారు. ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు నేరుగా అవగాహన కల్పిస్తూ ప్రమాదాలపై హెచ్చరిస్తున్నారు. జారుడు పర్వత మార్గాల్లో సరైన సన్నద్ధత లేకుండా వెళ్లడం, నీటి ప్రాంతాల వద్ద పిల్లలను ఒంటరిగా వదిలేయడం, దట్టమైన పొగమంచు, బురద రోడ్లలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

భద్రతా సూచనలు పాటించాలి

ఖరీఫ్ అందాలను ఆస్వాదించే సమయంలో వాతావరణ హెచ్చరికలను గౌరవించాలని, అధికారుల భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అనవసరమైన ప్రమాదాలకు దూరంగా ఉండాలని CDAA పర్యాటకులకు విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com