ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- August 28, 2026
దోహా: ఖతార్ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో స్పెషలిస్ట్ వైద్యుడిని తొలిసారి కలిసేందుకు రోగులు వేచి ఉండాల్సిన సగటు సమయం 58 రోజుల నుంచి సుమారు 16 రోజులకు తగ్గింది. HMC మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ సువైదీ ఈ విషయాన్ని నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ‘అల్ తన్మియా’ పోడ్కాస్ట్ నాలుగో ఎపిసోడ్లో వెల్లడించారు.
బాధ్యతలు చేపట్టిన సమయంలో HMC ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో దీర్ఘకాలిక వెయిటింగ్ లిస్టులు ఒకటిగా గుర్తించినట్లు అల్ సువైదీ తెలిపారు. 2024లో 70,000 మందికి పైగా రోగులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారని చెప్పారు. రిఫరల్ దశ నుంచి స్పెషలిస్ట్ వైద్యుడి వద్ద చికిత్స పొందే వరకు రోగి ప్రయాణాన్ని HMC పూర్తిగా విశ్లేషించింది. ఈ క్రమంలో తొలి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కోసం సగటున 58 రోజులు వేచి ఉండాల్సి వస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఈ సమయాన్ని సుమారు రెండు వారాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని పలు చర్యలు చేపట్టింది.
సాయంత్రం వరకు క్లినిక్స్.. రెండు షిఫ్టులు
వైద్య సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేట్ ఆసుపత్రులతో సహకారం, క్లినిక్‌ల పని వేళలను సాయంత్రం వరకు పొడిగించడం, కొన్ని క్లినిక్‌లను రెండు షిఫ్టుల్లో నిర్వహించడం వంటి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా తొలి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సగటు సమయం ప్రస్తుతం 16 రోజులకు తగ్గినట్లు అల్ సువైదీ తెలిపారు.
అయితే తొలి అపాయింట్మెంట్, ఫాలోఅప్ అపాయింట్మెంట్లను వేర్వేరుగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో వైద్యుడు సూచించిన వ్యవధి తర్వాత రోగిని మళ్లీ పరీక్షించేందుకు అపాయింట్మెంట్ ఇస్తారని, అది ఆసుపత్రుల్లో సామర్థ్యం లేకపోవడం వల్ల ఏర్పడిన ఆలస్యం కాదని వివరించారు.
HMC పరిధిలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలపై భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ సేవలను విస్తృతంగా అందిస్తున్నట్లు అల్ సువైదీ తెలిపారు. HMC పరిధిలో ల్యాబొరేటరీ పరీక్షలు, మెడికల్ ఇమేజింగ్, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, క్యాన్సర్ చికిత్స తదితర రంగాల్లో సుమారు 22,000 రకాల సేవలు అందుతున్నాయి.మొత్తంగా గత ఆరు నెలల వ్యవధిలో HMC సుమారు 2.5 కోట్ల వైద్య సేవలను అందించినట్లు అల్ సువైదీ వెల్లడించారు.
‘ల్బైహ్’ యాప్‌తో ఇంటి నుంచే సేవలు
రోగులకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని HMC తెలిపింది. HMCకు చెందిన ‘ల్బైహ్’ అప్లికేషన్‌ను సుమారు 4 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 లక్షల లావాదేవీలు ఈ యాప్ ద్వారా నమోదయ్యాయి. యాప్ ద్వారా రోగులు మందుల వివరాలను తెలుసుకోవచ్చు. రక్త పరీక్షల ఫలితాలను చూడవచ్చు. రేడియాలజీ రిపోర్టులను యాక్సెస్ చేయవచ్చు. అపాయింట్మెంట్లలో మార్పులు కోరవచ్చు. ప్రిస్క్రిప్షన్ మందులను రీఆర్డర్ చేయవచ్చని తెలిపారు. అంతేకాకుండా మందులను ఆన్లైన్లో కోరితే ఖతార్ పోస్ట్ ద్వారా ఇంటికే డెలివరీ చేసే సదుపాయం కూడా ఉందన్నారు.ఇలాంటి డిజిటల్ సేవలతో రోగుల సమయం ఆదా కావడంతో పాటు ఆసుపత్రులు, క్లినిక్‌లపై ఒత్తిడి కూడా తగ్గుతుందని అల్ సువైదీ తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థల్లో రోగుల ఆరోగ్య సమాచారాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి కూడా కృషి జరుగుతోందని ఆయన చెప్పారు. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే వైద్యులు ఒకే ప్లాట్ఫామ్లో రోగుల మందుల చరిత్ర, ల్యాబ్ ఫలితాలు, స్కానింగ్, ఇమేజింగ్ రికార్డులను పరిశీలించగలుగుతారు. దీంతో ఒకే పరీక్షలను మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం తగ్గడంతో పాటు వివిధ వైద్యులు సూచించే మందుల మధ్య సంభవించే సమస్యలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
2026 తొలి ఆరు నెలల్లో HMCకు సుమారు 7 లక్షల ఎమర్జెన్సీ కేసులు వచ్చినట్లు అల్ సువైదీ తెలిపారు. అత్యవసర విభాగాల్లో రోగుల పరిస్థితిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసరత ప్రమాణాల ప్రకారం అంచనా వేసి, అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారికి ముందుగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తక్కువ తీవ్రత కలిగిన అత్యవసర పరిస్థితులకు చికిత్స అందించేందుకు సుమారు 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల అర్జెంట్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో ఆసుపత్రుల ఎమర్జెన్సీ విభాగాలపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలవుతోందన్నారు.
రోగులు తమ పరిస్థితిని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్జెంట్ కేర్ సెంటర్, స్పెషలిస్ట్ ఆసుపత్రి లేదా ఎమర్జెన్సీ విభాగాన్ని ఎంచుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రాంతీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఎదురైనా వైద్య సేవలు కొనసాగించేలా HMC ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని అల్ సువైదీ తెలిపారు. ఖతార్ వ్యూహాత్మక ఔషధ నిల్వలో కొంత భాగాన్ని నిర్వహించే బాధ్యత HMCకి ఉందని, అత్యవసర మందులు, కీలక వైద్య సరఫరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
2026లో ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో మందుల సరఫరా విధానాలను సమీక్షించినట్లు తెలిపారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందాలు, ప్రత్యామ్నాయ సమానమైన మందుల వినియోగం ద్వారా సరఫరా భద్రతను మరింత బలోపేతం చేసినట్లు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో వైద్య పరికరాలపై ఆధారపడే రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రోగుల అనుభవాన్ని మెరుగుపరచడం HMC వ్యూహంలో ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని అల్ సువైదీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు







