ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!

- August 31, 2026 , by Maagulf
ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!

న్యూ ఢిల్లీ:  డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థ PhonePe కీలకమైన కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించే ‘PhonePe UPI 123Pay’ సేవను ఆగస్టు 31, 2026న ప్రారంభించింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు లేని ఫీచర్‌ఫోన్ (Phonepe New Feature) వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవను రూపొందించింది.

SMS ఆధారిత టెక్నాలజీ:
దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఫీచర్‌ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని చేరువ చేయడమే ఈ కొత్త సేవ లక్ష్యంగా PhonePe తెలిపింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, SMS ఆధారిత టెక్నాలజీ ద్వారా UPI లావాదేవీలు నిర్వహించుకునేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తక్కువ 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులో ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు మరో వ్యక్తికి డబ్బు పంపడం, వ్యాపారులకు చెల్లింపులు చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడటం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. కెమెరా ఉన్న ఫీచర్‌ఫోన్లలో QR కోడ్ స్కాన్ చేసి చెల్లించే సదుపాయం కూడా ఉంటుంది.

నోకియా, HMD, లావా, ఐటెల్ వంటి హ్యాండ్‌సెట్ తయారీదారులతో PhonePe భాగస్వామ్యం చేసుకుంది. ఎంపిక చేసిన ఫీచర్‌ఫోన్లలో ఈ సేవ ముందుగానే అందుబాటులో ఉండనుంది. రాబోయే నెలల్లో మరిన్ని డివైజ్‌లకు మద్దతు విస్తరించనున్నట్లు సమాచారం.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్, మొబైల్ డేటా లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయడంలో ఇది కీలక అడుగుగా PhonePe అభివర్ణిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com