సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- September 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ 2027 జనవరి 31 వరకు కొనసాగనుంది. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ సహజ వనరులను స్థిరంగా వినియోగించే లక్ష్యంతో కొత్త నియంత్రణ వ్యవస్థ కింద వేటకు అనుమతులు ఇస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NCW) ప్రకటించింది. 2021లో ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇది ఆరో నియంత్రిత వేట సీజన్.
ఈ ఏడాది నిబంధనల్లో పలు మార్పులు చేశారు. వేటకు అనుమతించే జాతుల సంఖ్యను 30కి పెంచారు. జాతీయ వేట కోటాను 11 శాతం, వేట లైసెన్సుల సంఖ్యను 34 శాతం పెంచారు. ఫాల్కన్‌లతో వేట చేయగల జాతులకు సంబంధించిన అనుమతుల కోసం చెల్లుబాటు అయ్యే ఫాల్కన్ యాజమాన్య ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ తప్పనిసరి చేశారు. దీనివల్ల వేటకు సంబంధించిన డేటా మరింత విశ్వసనీయంగా ఉండటంతో పాటు నిబంధనల అమలు పటిష్టం కానుంది.
ఫిట్రీ ప్లాట్‌ఫామ్ ద్వారా అనుమతి
నిర్దేశిత సీజన్‌లో భూభాగ వన్యప్రాణుల వేటకు NCW వెబ్‌సైట్, ఫిట్రీ ప్లాట్‌ఫామ్‌లో అనుమతించిన జాతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. లైసెన్స్ పొందిన, అనుమతించబడిన వేట రైఫిళ్లను ఉపయోగించే వేటగాళ్లు, అలాగే సౌదీ ఫాల్కన్స్ క్లబ్‌లో నమోదైన ఫాల్కనర్లు తప్పనిసరిగా ఫిట్రీ ప్లాట్‌ఫామ్ ద్వారా వేట అనుమతి పొందాలి. అనుమతించే రైఫిళ్లలో గన్‌పౌడర్‌కు బదులుగా కంప్రెస్డ్ గ్యాస్ లేదా స్ప్రింగ్ మెకానిజం ద్వారా ప్రాజెక్టైల్‌ను ప్రయోగించే ఎయిర్, గ్యాస్ రైఫిళ్లు ఉన్నాయి. ప్రమాదంలో ఉన్న లేదా అంతరించిపోతున్న భూభాగ వన్యప్రాణుల జాతులను వేటాడటాన్ని శాశ్వతంగా నిషేధించారు. అలాగే అన్ని వన్యప్రాణులు, పక్షులను కూడా నిర్దేశిత నో-హంటింగ్ ప్రాంతాల్లో వేటాడేందుకు అనుమతి లేదు.
షాట్‌గన్లు, వేట వలలకు అనుమతి లేదు
చట్టబద్ధంగా అనుమతించిన పద్ధతుల్లో మాత్రమే వేట నిర్వహించాలి. ఒకేసారి ఒక పక్షి కంటే ఎక్కువ వేటాడకుండా ఉండే విధానాలకు మాత్రమే అనుమతి ఉంది. షాట్‌గన్లు, వేట వలలు, పక్షులను ఆకర్షించే పరికరాలు, పిలుపులు (calls) తదితర అనధికార పద్ధతులను ఉపయోగించడం నిషేధం.పర్యావరణ చట్టం, భూభాగ వన్యప్రాణుల వేటకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నిబంధనలను ప్రతి వేటగాడు పాటించాలని NCW సూచించింది. ఉల్లంఘనలకు చట్టం ప్రకారం జరిమానాలు, ఇతర శిక్షలు విధించనున్నట్లు NCW సీఈఓ డాక్టర్ మహమ్మద్ ఖుర్బాన్ తెలిపారు.
వేటగాళ్ల సహకారం కీలకం
నిబంధనలను పాటించే బాధ్యతాయుతమైన వేటగాళ్లు వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములని ఖుర్బాన్ పేర్కొన్నారు. పరిమితికి మించి లేదా విచక్షణారహితంగా వేటాడితే జాతుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమతించిన జాతులు, కోటా, సమయం, ప్రాంతాలు, వేట పద్ధతులను పాటించడం ద్వారా వన్యప్రాణుల సహజ పునరుత్పత్తికి, భవిష్యత్ తరాల కోసం వాటి సంరక్షణకు అవకాశం ఉంటుందని తెలిపారు. వలస పక్షుల అక్రమ వేట, పట్టివేత, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడంలో సౌదీ అరేబియా చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని NCW తెలిపింది. వలస జాతుల సంరక్షణలో చేసిన కృషికి సౌదీ అరేబియాకు “Champion Plus for Migratory Species” అవార్డు లభించింది.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







