ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!

- September 07, 2026 , by Maagulf
ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!

మస్కట్: ఒమన్‌లో కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2025లో ఒక ఒమనీ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం OMR1,839.3కు చేరగా, 2018తో పోలిస్తే ఇది 18.5 శాతం పెరుగుదలగా నమోదైంది.

జనాభా, కార్మిక శక్తి గణాంకాల విభాగం డైరెక్టర్ హలీమా బింట్ యూసఫ్ అల్ వహైబియా ఈ సర్వే వివరాలను వెల్లడించారు. 2025కు సంబంధించిన ఏఐ ఆధారిత గణాంకాలను 2018 ప్రాథమిక గణాంకాలతో పోల్చి ఈ వివరాలను రూపొందించారు.

2018లో ఒమనీ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం OMR1,552.6 ఉండగా, 2025లో అది OMR1,839.3కు పెరిగింది. మరోవైపు, ప్రవాస కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం 7.3 శాతం పెరిగి OMR717.2కు చేరింది. 2018లో ఇది OMR668.6గా నమోదైంది.

దేశంలోని అన్ని వర్గాల కుటుంబాలను కలిపి చూస్తే, సగటు నెలవారీ కుటుంబ ఆదాయం 18.7 శాతం పెరిగి OMR1,392.8కు చేరింది. 2018లో ఇది OMR1,173.7గా ఉంది.

ఖర్చులు సైతం..

2025లో ఒమనీ కుటుంబాల సగటు నెలవారీ మొత్తం వ్యయం OMR1,058.8గా నమోదైంది. ఇది 2018లోని OMR931.4తో పోలిస్తే 13.7 శాతం పెరుగుదల.

ప్రవాస కుటుంబాల నెలవారీ ఖర్చు కూడా 11 శాతం పెరిగి OMR402కు చేరింది. 2018లో ఇది OMR362గా ఉంది. అన్ని వర్గాల కుటుంబాలను కలిపి చూస్తే, సగటు నెలవారీ కుటుంబ వ్యయం 15.9 శాతం పెరిగి OMR798కు చేరింది. గతంలో ఇది OMR687.5గా నమోదైంది.

అయితే, ఒమనీ కుటుంబాల ఆదాయం 18.5 శాతం పెరగగా, జీవన వ్యయం 13.7 శాతం మాత్రమే పెరగడం దేశ పౌరుల ఆర్థిక పరిస్థితిలో సానుకూల ధోరణిని సూచిస్తోందని నివేదిక పేర్కొంది.

ఏఐ ఆధారిత గణాంకాల తయారీ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఒమన్ ఆధునిక ప్రభుత్వ గణాంకాల రంగంలో కొత్త దిశగా అడుగులు వేస్తోందని, భవిష్యత్తులో మరింత వేగవంతమైన, డేటా ఆధారిత ఆర్థిక విధానాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com