‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!

- September 07, 2026 , by Maagulf
‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!

దోహా: గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక సమీకరణను మరింత బలోపేతం చేసే దిశగా ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ పేమెంట్స్ కంపెనీ (GPC) నిర్వహిస్తున్న అఫాక్ (AFAQ) పేమెంట్స్ సిస్టమ్‌లో చేరినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ చేరికతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లోని అన్ని సభ్య దేశాల మధ్య ఆర్థిక, ద్రవ్య సమన్వయం మరింత బలపడనుంది.

అఫాక్ వ్యవస్థలో ఖతార్‌కు చెందిన మూడు వాణిజ్య బ్యాంకులు కూడా చేరాయి. దోహా బ్యాంక్, ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, దుఖాన్ బ్యాంక్ ఈ వ్యవస్థలో భాగమైన తొలి ఖతారీ వాణిజ్య బ్యాంకులుగా నిలిచాయి. దీంతో GCC దేశాల నుంచి అఫాక్ వ్యవస్థలో ఉన్న మొత్తం బ్యాంకుల సంఖ్య 74కు చేరింది.

ఖతార్ సెంట్రల్ బ్యాంక్ చేరిక గల్ఫ్ ప్రాంత చెల్లింపుల వ్యవస్థ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ముఖ్యంగా జీసీసీ దేశాల మధ్య జరిగే చెల్లింపులు, ఆర్థిక బదిలీలలో వేగం, సామర్థ్యం, భద్రత పెరగనున్నాయి. అలాగే వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడుల ప్రవాహానికి కూడా ఈ వ్యవస్థ తోడ్పడుతుందని భావిస్తున్నారు.

GCC సభ్య దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రాంతీయ చెల్లింపు పరిష్కారాలను అభివృద్ధి చేసే ఉమ్మడి ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. భవిష్యత్తులో అఫాక్ వ్యవస్థలో మరిన్ని వాణిజ్య బ్యాంకులు చేరే అవకాశం ఉందని, సేవలను GCC దేశాలవ్యాప్తంగా మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com