జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..

- September 07, 2026 , by Maagulf
జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. \'నందూస్ వరల్డ్\' నందన అరెస్ట్..

హైదరాబాద్: యూకే ఆధారిత పాపులర్ యూట్యూబ్ ఛానెల్ నందూస్ వరల్డ్ (Nandu's World) నిర్వాహకురాలు, ఎన్ఆర్ఐ రామ నందన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లండన్‌లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు, యూకే వీసాలు ఇప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నందనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. నేడు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ఈమెపై జారీ అయిన లుక్‌అవుట్ సర్క్యులర్ ఆధారంగా విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.

నందన అతని భర్త మధు యూకే వీసాలు, జాబ్స్ పేరుతో దందా చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని యూకేలో ఉద్యోగాలు, స్టూడెంట్ వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. విదేశీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.


డిగ్రీలు పూర్తి చేసి విదేశీ కలలతో ఉన్న యువతను టార్గెట్ చేస్తూ నందన మరియు ఆమె భర్త భారీగా దందా నడిపారని, డబ్బులు ఇచ్చాక ఫోన్లు ఎత్తడం మానేశారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై నందన.. అవన్నీ కేవలం పుకార్లని, తమపై కుట్ర చేస్తున్నారని తెలిపింది. ఇక నందు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులకు అప్పగించనున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు త్వరలోనే ఆమెను విచారించనున్నారు. ఎంతో సాంప్రదాయకంగా.. ఫ్యామిలీతో ఉండే ఆమె.. ఇలాంటి మోసాలు చేస్తుందని అస్సలు అనుకోలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com