GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!

- September 15, 2026 , by Maagulf
GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!

మనామా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లోని సభ్య దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక చర్చలు జరిగాయి. బహ్రెయిన్ అధ్యక్షతన జరుగుతున్న GCC 46వ సెషన్‌లో భాగంగా సెప్టెంబర్ 14న GCC సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల కమిటీ 87వ సమావేశం నిర్వహించారు. బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ హుమైదాన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. GCC సెక్రటరీ జనరల్ జాసిమ్ మొహమ్మద్ అల్ బుదైవీతో పాటు సభ్య దేశాల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్థిక, ద్రవ్య స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు GCC దేశాలు తమ సెంట్రల్ బ్యాంకుల మధ్య సహకారం, సమన్వయాన్ని కొనసాగిస్తున్న తీరును ఖలీద్ హుమైదాన్ ప్రశంసించారు. GCC ప్రాంతంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధికి ఈ రంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు.

సభ్య దేశాల మధ్య బ్యాంకింగ్ సహకారాన్ని మరింత పెంచే అంశాలపై కమిటీ చర్చించింది. GCC పేమెంట్ సిస్టమ్స్ అమలు ప్రణాళిక, బ్యాంకింగ్ రంగంపై పర్యవేక్షణ, నియంత్రణ, ప్రాంతీయ స్థాయిలో ఫైనాన్షియల్ టెక్నాలజీల అభివృద్ధికి సంబంధించి వివిధ కమిటీలు, వర్కింగ్ గ్రూపులు చేసిన సిఫారసులను సమావేశంలో పరిశీలించారు.

అలాగే బ్యాంకింగ్ రంగంలో సైబర్ సెక్యూరిటీ సమాచార మార్పిడి అంశంపైనా చర్చ జరిగింది. GCC దేశాలు కలిసి మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలను కూడా సమీక్షించారు. GCC దేశాల మధ్య ఆర్థిక, బ్యాంకింగ్ సమన్వయం మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యంగా నిలిచిందని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com