దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి

- September 18, 2026 , by Maagulf
దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి

దుబాయ్: కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దుబాయ్ మున్సిపాలిటీ పలు కీలక చర్యలు చేపడుతోంది. కార్మికుల వసతి గదుల్లో ఒక్కో వ్యక్తికి కనీసం 3.7 చదరపు మీటర్ల నిద్రించే స్థలం ఉండేలా నిబంధనలు అమలు చేస్తున్నట్లు మున్సిపాలిటీ వెల్లడించింది.

అదేవిధంగా ఒక్కో కార్మికుడికి 0.75 నుంచి 1.5 చదరపు మీటర్ల వరకు బహిరంగ స్థలం, వినోద సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికా ప్రమాణాలు నిర్దేశించినట్లు తెలిపింది.

కాగా, ఒక్కో కార్మికుడికి 3.7 చదరపు మీటర్ల కనీస స్థలం కల్పించాలనే నిబంధన కొత్తది కాదు. 2020లో జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ రిజల్యూషన్ నంబర్ 110 ప్రకారం కార్మికుల వసతి గదుల్లో ఒక్కో వ్యక్తికి కనీసం 3.7 చదరపు మీటర్ల స్థలం ఉండాలి.

1,417కు పైగా వసతి భవనాల పరిశీలన

కార్మికుల ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టులు, కార్యక్రమాల పురోగతిని దుబాయ్ మున్సిపాలిటీ వెల్లడించింది.

ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలతో కలిసి రూపొందించిన ఈ కార్యక్రమంలో కార్మికుల వసతి భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సేవలు, కమ్యూనిటీ ప్రదేశాలు, వినోద సదుపాయాలను మెరుగుపరచడం వంటి చర్యలు ఉన్నాయి. ఇవి దుబాయ్ Workers’ Accommodation Policy అమలుకు మద్దతు ఇవ్వడంతో పాటు సురక్షితమైన, స్థిరమైన కార్మికుల నివాస సమాజాల ఏర్పాటుకు దోహదపడతాయని మున్సిపాలిటీ తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 1,417కుపైగా కార్మికుల వసతి భవనాలను సర్వే చేసి, వాటి పరిస్థితులను అంచనా వేశారు.

19 మోడల్ వసతులకు గుర్తింపు

పరిశీలన అనంతరం 19 మోడల్ కార్మికుల వసతి కేంద్రాలను గుర్తించారు. వీటిలో 7 వసతులకు సిల్వర్, 9కు గోల్డ్, 3 వసతులకు ప్లాటినం స్థాయి గుర్తింపు లభించింది.

అలాగే కార్మికుల ప్రాంతాల్లో ప్రణాళిక, ప్రాజెక్టుల అమలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేలా ఏకీకృత ప్రభుత్వ డేటాబేస్‌ను దుబాయ్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసింది.

వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మరింత అభివృద్ధి అవసరమైన ప్రాంతాలను గుర్తించి, వాటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మున్సిపాలిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com