తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా

- September 18, 2026 , by Maagulf
తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో వనరుల సమర్థ వినియోగం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.90 కోట్ల ఆదా జరిగిందని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. నెలవారీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో శాఖలో చేపట్టిన విధానపరమైన చర్యలు, పరిపాలనా, కార్యాచరణ అంశాల పై సీనియర్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

మానవ వనరులు, వాహనాలు, ఇతర వనరుల పై ఇటీవల నిర్వహించిన ఆడిట్, ఆప్టిమైజేషన్ చర్యలతో మంచి ఫలితాలు సాధించినట్లు డీజీపీ తెలిపారు. మావోయిజం అంతం కావడంతో అవసరం లేని భద్రతా సిబ్బందిని ఉపసంహరించడం ద్వారా 376 మంది సిబ్బంది, 20 బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, 7 ఫార్చ్యూనర్ వాహనాలు, 18 ఇన్నోవా క్రిస్టా వాహనాలు, మరో 58 కార్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. వీటిని అత్యవసరంగా అవసరమైన విభాగాలు, సంస్థలకు తిరిగి కేటాయించినట్లు చెప్పారు.

573 మంది సిబ్బంది ఇతర విభాగాలకు

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 573 మంది సిబ్బందికి చెల్లిస్తున్న 60 శాతం అదనపు వేతనాన్ని ఆదా చేస్తూ, వారిని అవసరమున్న ఇతర విభాగాలకు కేటాయించినట్లు డీజీపీ తెలిపారు.

ACB, CID, నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, విజిలెన్స్, సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆహార కల్తీ నిరోధక విభాగం, ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ తదితర విభాగాలకు సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. ఈ చర్యతో సుమారు రూ.28.16 కోట్లు ఆదా అయ్యాయని, అన్ని వనరుల ఆప్టిమైజేషన్ చర్యలను కలిపి ప్రభుత్వానికి సుమారు రూ.90 కోట్ల ఆదా జరిగినట్లు తెలిపారు.

తెలంగాణ పోలీస్‌లో ప్రస్తుతం మంజూరైన 93,000 సాంక్షన్డ్ స్ట్రెంత్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అవసరమున్న సంస్థలు, కొత్త విభాగాలకు కేటాయించే అంశంపైనా సమావేశంలో చర్చించారు.

Southern States DGPs’ Conference ఏర్పాట్లు

వచ్చే నెలలో తెలంగాణ పోలీస్ ఆతిథ్యం ఇవ్వనున్న Southern States DGPs’ Conference (RPCC) ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అలాగే రాష్ట్ర IPS అధికారుల సంఘానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునే అంశంపైనా సమీక్ష జరిగింది.

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సును నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగుపరిచేందుకు FitCop కార్యక్రమాన్ని మొత్తం పోలీస్ శాఖలో అమలు చేసే అంశంపై కూడా చర్చించారు.

పోలీస్ రిట్రీట్, పదోన్నతుల పై సమీక్ష

గత ఏడాది నిర్వహించిన TG Police Retreatలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని అధికారులు సమీక్షించారు. ఈ ఏడాది నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్‌కు సంబంధించిన అజెండాపైనా చర్చ జరిగింది.

అదేవిధంగా 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారుల పదోన్నతుల అంశంపై విస్తృతంగా చర్చించారు. కొత్త TG Police Manual, Compendiums తుది రూపకల్పన, IPS ఖాళీలు, పోస్టింగ్స్‌కు సంబంధించిన అంశాలను కూడా సమావేశంలో పరిశీలించారు. ముఖ్యంగా IG, అంతకంటే పైస్థాయి ర్యాంకుల్లో ఉన్న ఖాళీలపై చర్చ జరిగింది.

కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ పై చర్చ

CURE పరిధిలోని నాలుగు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని కూడా అధికారులు చర్చించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ మూడో వారంలో నిర్వహించనున్న Community Connect కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు.

వీటితో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ బడ్జెట్, పరిపాలనా అంశాలను కూడా సమావేశంలో సమీక్షించారు.

సీనియర్ పోలీస్ అధికారులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు ఇలాంటి సమావేశాలు అవకాశం కల్పిస్తాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. తద్వారా పరిపాలనా నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకోవడంతో పాటు, వాటిని పూర్తి నిబద్ధతతో అమలు చేయడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com