పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- September 18, 2026
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ నిబంధనలు, దరఖాస్తు రుసుముల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా మైనర్ల పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువుతో పాటు సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల ఫీజులను సవరించింది. 2012 తర్వాత తొలిసారిగా సాధారణ పాస్‌పోర్ట్ ఫీజుల్లో మార్పులు చేయడం గమనార్హం. కొత్త రుసుములు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్‌కు పరిమిత గడువు
కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్ ఐదేళ్ల పాటు లేదా వారు 18 ఏళ్లు నిండే వరకు.. ఏది ముందైతే అది వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు పూర్తి 10 ఏళ్ల చెల్లుబాటు కలిగిన పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే కేటగిరీలోకి వస్తే, వారికి పెద్దలకు వర్తించే రుసుములనే వసూలు చేస్తారు.
పెద్దలకు కొత్త ఫీజులు
18 ఏళ్లు పైబడిన వారు 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కొత్తగా పొందడానికి లేదా రెన్యువల్ చేసుకోవడానికి రూ.2,500 చెల్లించాలి. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.3,500 రుసుముగా నిర్ణయించారు.
తత్కాల్ విధానంలో 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది.
మైనర్లకు ఎంతంటే..
18 ఏళ్లలోపు పిల్లలకు 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కొత్తగా తీసుకోవడానికి లేదా రెన్యువల్ చేసుకోవడానికి రూ.1,750 ఫీజు ఉంటుంది. తత్కాల్ విధానంలో ఇదే పాస్‌పోర్ట్‌కు రూ.4,250 చెల్లించాలి.
చిన్నారులు, సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ కొనసాగింపు
8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు 10 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం కొనసాగుతోంది. అయితే ఈ రాయితీ రెన్యువల్ దరఖాస్తులకు వర్తించదు.
పాస్‌పోర్ట్ పోయినా.. డ్యామేజ్ అయినా ఫీజు పెంపు
పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా కొత్త పాస్‌పోర్ట్ పొందేందుకు చెల్లించే రుసుములను కూడా సవరించారు. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాలి.
అలాగే పాస్‌పోర్ట్ ఆధారిత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC), సరెండర్ సర్టిఫికెట్ తదితర సేవలకు రూ.750 రుసుము నిర్ణయించారు.
కొత్త రుసుములు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక పాస్‌పోర్ట్ పోర్టల్‌లో పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే
- తమిళనాడులో ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం..
- ‘ఓణత్తాళం’ కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్ రెడ్డి
- బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు
- దుబాయ్: కార్మికుల వసతి గదిలో ఒక్కొక్కరికి 3.7 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి
- హైదరాబాద్‌లో ‘న్యూ ఐడెంటిటీ’ ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభం
- తెలంగాణ పోలీస్‌లో వనరుల ఆప్టిమైజేషన్..రూ.90 కోట్లకు పైగా ఆదా
- అమరావతి అభివృద్ధి పై CRDA కీలక నిర్ణయాలు
- గుడ్ న్యూస్..డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ







