ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!

- September 19, 2026 , by Maagulf
ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!

దోహా: గాజాకు ఖతార్ అందిస్తున్న మానవతా సహాయానికి సంబంధించిన విషయాలపై ఇజ్రాయెల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు ఆరోపణలు, కల్పిత కథనాలను ఖతార్ ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ ఖండించింది. ఖతార్ అందిస్తున్న మానవతా సహాయం ఎక్కడికి చేరుతుందనే అంశంపై ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మీడియా ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌లోని కొన్ని అతివాద రాజకీయ వర్గాలు, రాజకీయ నాయకులు తమ దేశీయ రాజకీయ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
‘ఖతార్ ఎప్పుడూ హమాస్‌కు డబ్బు ఇవ్వలేదు’

ఖతార్ ఎప్పుడూ హమాస్‌కు డబ్బు అందించలేదని ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ స్పష్టం చేసింది. గాజాలోని పాలస్తీనా పౌరులకు మాత్రమే తమ సహాయం అందించామని తెలిపింది. ఇజ్రాయెల్ అధికారులు, అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ సహాయాన్ని అందించినట్లు పేర్కొంది. గతంలో అమలు చేసిన సహాయ వ్యవస్థలలో ఆహారం, మందులు, ఇంధనం, ఆర్థిక సహాయం వంటి వాటిని గాజాలోకి పంపే ముందు ఇజ్రాయెల్ ద్వారానే తరలించినట్లు తెలిపింది. ఖతార్ నుంచి ఎలాంటి సహాయాన్ని నేరుగా పంపలేదని, తాము సహాయం అందించగా, దాని పంపిణీని ఐక్యరాజ్యసమితి సంస్థలు ఇజ్రాయెల్ అధికారులతో సమన్వయంతో నిర్వహించాయని ప్రకటనలో వివరించింది.

ఇజ్రాయెల్ అనుకూల మీడియా, లాబీయిస్టులు, న్యాయవాదులు, థింక్‌ట్యాంకులు, పరిశోధనా సంస్థల పేరుతో పనిచేసే కొన్ని సంస్థల ద్వారా కొన్నేళ్లుగా ఖతార్‌పై నిరంతర ప్రచారం జరుగుతోందని ప్రకటన పేర్కొంది.ఇజ్రాయెల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మరింత పెరుగుతోందని, రాజకీయ నాయకులు తమ దేశీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఖతార్ అభిప్రాయం తెలిపింది. ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనే ఆసక్తి ఖతార్‌కు లేదని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం తమ దేశంపై తప్పుడు ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని పేర్కొంది.

తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు గాజాలో అత్యవసర మానవతా సహాయం అవసరమైన పాలస్తీనా ప్రజలకు ఖతార్ అందిస్తున్న మద్దతును ప్రభావితం చేయవని ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే ఘర్షణలకు ముగింపు పలికి, ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, భద్రతను సాధించేందుకు మధ్యవర్తిత్వం, దౌత్యపరమైన ప్రయత్నాలనే మార్గంగా ఖతార్ కొనసాగిస్తుందని ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com