అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్‌..!!

- September 19, 2026 , by Maagulf
అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్‌..!!

అబుదాబి: భవిష్యత్తులో కారులో కాకుండా గాలిలో ప్రయాణించే ఫ్లయింగ్ కార్‌తో అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమా (RAK) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా రాస్ అల్ ఖైమా, చైనాకు చెందిన ప్రముఖ ఫ్లయింగ్-కార్ తయారీ సంస్థ అరిడ్జ్( Aridge) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

యూఏఈ  జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) పర్యవేక్షణలో రాస్ అల్ ఖైమా ఎడారి ప్రాంతాల్లో ఫ్లయింగ్ కార్లను పరీక్షించేందుకు ప్రత్యేక రెగ్యులేటరీ సాండ్ బాక్స్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త సాంకేతికతకు సంబంధించిన విమాన భద్రతా ప్రమాణాలు, గగనతల నిబంధనలు, ఆపరేటింగ్ విధానాలను విస్తృతంగా అమలు చేయడానికి ముందు నియంత్రిత వాతావరణంలో పరీక్షించడమే ఈ శాండ్‌బాక్స్ లక్ష్యమని అధికారులు తెలిపారు.

అబుదాబి–RAK డెమో రూట్
ఈ ఒప్పందంలో భాగంగా అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్ డెమోన్స్ట్రేషన్ రూట్ ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక రూపొందించారు. ఈ డెమో రూట్ ద్వారా విమాన మార్గం, ఫ్లైట్ ప్లానింగ్, గ్రౌండ్ సపోర్ట్, ప్రయాణికుల నిర్వహణ, భద్రతా విధానాలు వంటి అంశాలను పరీక్షించనున్నారు. ప్రస్తుతం అబుదాబి–రాస్ అల్ ఖైమా మధ్య రోడ్డు ప్రయాణానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత పరీక్షల దశను దాటి వాణిజ్య సేవలకు వస్తే, రెండు ఎమిరేట్ల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఇది మరో మార్గంగా మారే అవకాశం ఉంటుందన్నారు.

ఎడారి ప్రాంతాల్లో పరీక్షలు
రాస్ అల్ ఖైమా ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RAKTA) నేతృత్వంలో ఫ్లయింగ్ కార్లను ఎడారి పరిస్థితుల్లో పరీక్షించనుంది. వివిధ ఆపరేటింగ్ పరిస్థితుల్లో విమానం పనితీరును పరిశీలించి, నియంత్రిత గగనతలంలో అవసరమైన విధానాలను అభివృద్ధి చేయనున్నారు. ఇది కేవలం వాహన పరీక్ష మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్లను ప్రజా రవాణా వ్యవస్థలో ఎలా ఉపయోగించాలనే దానిపై కూడా అధికారులకు అనుభవాన్ని అందించనుందని భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com