హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!

- September 20, 2026 , by Maagulf
హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలీషియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ రాయల్ ఎయిర్ డిఫెన్స్ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయి. సెప్టెంబర్ 19న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు పనిచేస్తున్న సంకీర్ణ దళాలు వెల్లడించాయి.
సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ టుర్కీ అల్-మాలికీ మాట్లాడుతూ.. క్షిపణిని సౌదీ రాజధానికి చేరుకునేలోపే విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు. హౌతీల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యగా ఆయన పేర్కొన్నారు. రియాద్‌లోని పౌరులు, పౌర ఆస్తులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకునేందుకు హౌతీలు ప్రయత్నిస్తున్నారని అల్-మాలికీ ఆరోపించారు. రియాద్‌లో 80 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు.

పలు ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నం
బైష్, తాయిఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లోని పౌరులు, పౌర ఆస్తులను కూడా లక్ష్యంగా చేసుకునేందుకు హౌతీలు ప్రయత్నించారని అల్-మాలికీ తెలిపారు. అయితే సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను అడ్డుకున్నాయని చెప్పారు. మరిన్ని హౌతీ దాడులను నిరోధించేందుకు అంతర్జాతీయ మానవతా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే హక్కు సంకీర్ణ కమాండ్‌కు ఉందని అల్-మాలికీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com