కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!

- September 20, 2026 , by Maagulf
కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!

కువైట్ : కువైట్‌లో మహిళలకు నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్‌ కేసులే ఉన్నాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాధీ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వైద్య కేంద్రాల్లో 8,000 మందికి పైగా రొమ్ము క్యాన్సర్ రోగులు చికిత్స, వైద్య పర్యవేక్షణ పొందుతున్నారని వెల్లడించారు. మూడో కువైట్ బ్రెస్ట్ క్యాన్సర్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. ఈ సదస్సును కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్ నిర్వహించింది.

ముందస్తు గుర్తింపే కీలకం
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, వేగంగా నిర్ధారణ చేయడం, సకాలంలో చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని అల్ అవాధీ అన్నారు. చికిత్స ప్రక్రియలో రోగుల గౌరవాన్ని కాపాడటంతో పాటు, తమకు అందించే చికిత్సకు సంబంధించిన నిర్ణయాల్లో రోగులు కూడా భాగస్వాములు కావాల్సిన హక్కును గౌరవించాలని తెలిపారు.
బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కువైట్ తన వైద్య సామర్థ్యాలను మరింత బలోపేతం చేసిందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.
2014: నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ డిసీజెస్ ప్రారంభం
2015: ర్యాపిడ్ డయాగ్నోసిస్ క్లినిక్ ఏర్పాటు
2016: జెనెటిక్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు
2022: జాబర్ అల్-అహ్మద్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ఏర్పాటు
2023: రొమ్ము కణితుల శస్త్రచికిత్స, రీకన్‌స్ట్రక్షన్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు

ఆధునిక చికిత్సలు అందుబాటులోకి
క్యాన్సర్ స్వభావం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి హార్మోనల్, టార్గెటెడ్, ఇమ్యూనోథెరపీ, యాంటీబాడీ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్‌లో ప్రస్తుతం లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీ అమలును ప్రారంభించినట్లు వెల్లడించారు. కణితుల్లోని మాలిక్యులర్ మార్పులను విశ్లేషించేందుకు, అవసరమైన సందర్భాల్లో సరైన చికిత్సను ఎంపిక చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని వివరించారు.

2026లో కొత్త అధ్యయనం, ప్రత్యేక విభాగం
2026లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై క్లినికల్ స్టడీని సిద్ధం చేసి అమలు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించిందని అల్ అవాధీ తెలిపారు. అలాగే ఎపిడెమియాలజీ, క్యాన్సర్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ విభాగం క్యాన్సర్ కేసుల సంఖ్య, వ్యాప్తి ధోరణులను పర్యవేక్షించడం, డేటాను విశ్లేషించడం, ఆరోగ్య ప్రణాళికలు రూపొందించడంలో సహాయపడుతుందని తెలిపారు.

కువైట్‌లో పలు ఆధునిక చికిత్సలను ప్రారంభ దశలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా వైద్య రంగం ముందుకు సాగడంతో పాటు, నిపుణుల మధ్య అనుభవాలు, పరిజ్ఞానాన్ని పంచుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com