గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!

- September 25, 2026 , by Maagulf
గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!

దుబాయ్: గాజాలోని నిరుపేద కుటుంబాలు, చిన్నారుల కోసం 1 కోటి కంటే ఎక్కువ భోజన ప్యాకెట్లను సిద్ధం చేసే యూఏఈ మానవతా కార్యక్రమానికి దివంగత షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేరును పెట్టారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని “అహ్మద్ బిన్ రషీద్ హ్యూమానిటేరియన్ బ్రిడ్జ్”గా పిలవనున్నారు. దివంగత షేక్ అహ్మద్ సేవా భావం, దాతృత్వం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ పేరు పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సామాజిక కార్యక్రమం సెప్టెంబర్ 26 దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు, ప్రజలు, దివంగత షేక్ అహ్మద్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాజాలోని అత్యంత అవసరంలో ఉన్న కుటుంబాలు, పిల్లల కోసం ఆహార ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI), యూఏఈకి చెందిన ఆపరేషన్ చైవల్రస్ నైట్ 3 సహకారంతో నిర్వహిస్తోంది.

షేక్ అహ్మద్ సేవలకు గుర్తుగా

MBRGI సెక్రటరీ జనరల్ మొహమ్మద్ అల్ గెర్గావీ మాట్లాడుతూ.. షేక్ అహ్మద్ పేరు చాలా కాలంగా వినయం, దయ, దాతృత్వంతో ముడిపడి ఉందన్నారు. ఆయనను అభిమానించిన వేలాది మంది ఈ భారీ మానవతా కార్యక్రమం ద్వారా ఆయన జ్ఞాపకాలను గౌరవిస్తున్నారని తెలిపారు.  యూఏఈలో షేక్ అహ్మద్ అందించిన జాతీయ, సామాజిక సేవలను ప్రజలు ఎంతో గుర్తుంచుకున్నారని అల్ గెర్గావీ పేర్కొన్నారు. దేశానికి సేవ చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపడం UAEలో స్థిరపడిన జాతీయ విలువల్లో ఒకటని అన్నారు.

వాలంటీర్లకు ప్రోత్సాహం

“అహ్మద్ బిన్ రషీద్ హ్యూమానిటేరియన్ బ్రిడ్జ్” కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సేవా భావాన్ని ప్రోత్సహించడంతో పాటు యూఏఈలో సమాజ భాగస్వామ్యం, సేవా సంస్కృతిని మరింత బలోపేతం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఏఈ నుంచి ప్రారంభమయ్యే మానవతా కార్యక్రమాలకు ప్రజల మద్దతును, ప్రపంచవ్యాప్తంగా బాధితులకు సహాయం చేయాలనే సామాజిక నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com