యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!

- September 26, 2026 , by Maagulf
యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!

షార్జా: ప్రభుత్వ సంస్థ ప్రతినిధులమంటూ ఓ వ్యక్తిని నమ్మించి ఫేక్ లాటరీ పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరికి షార్జా మిస్డిమీనర్స్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత ఇద్దరినీ యూఏఈ నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు రికార్డుల ప్రకారం.. బాధితుడికి ఫోన్ చేసిన నిందితులు తాను Dh200,000 నగదు బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. తాము ప్రభుత్వ సంస్థకు చెందిన ప్రతినిధులమని చెప్పడంతో బాధితుడు వారిని నమ్మాడు.

బహుమతి కోసం అంటూ బ్యాంక్ వివరాలు

Dh200,000 బహుమతి పొందేందుకు కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందని నిందితులు బాధితుడికి తెలిపారు. ఇందులో భాగంగా వ్యక్తిగత గుర్తింపు వివరాలు, బ్యాంకింగ్‌ సమాచారాన్ని కోరారు.

అంతేకాకుండా బాధితుడి బ్యాంక్ ఖాతాకు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP)ను కూడా చెప్పాలని ఒత్తిడి చేశారు. బహుమతి పొందేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియగా భావించిన బాధితుడు ఆ వివరాలను నిందితులకు అందించాడు. అయితే Dh200,000 అతని ఖాతాలో జమ కావాల్సింది పోయి.. ఖాతా నుంచి Dh84,000 డెబిట్‌ అయినట్లు గుర్తించాడు.

ఇద్దరికీ జైలు.. దేశ బహిష్కరణ

ఘటనపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు షార్జా మిస్డిమీనర్స్‌ కోర్టుకు చేరింది. మోసపూరిత పద్ధతుల్లో బాధితుడి బ్యాంకింగ్‌ వివరాలను పొంది, అతని డబ్బును కాజేసినట్లు ప్రాసిక్యూషన్‌ నిందితులపై ఆరోపణలు చేసింది. కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ అబ్సెన్షియాలో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం యూఏఈ నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

OTP ఎవరితోనూ పంచుకోవద్దు

నకిలీ బహుమతి లేదా లాటరీ పేరుతో బాధితుల్లో ఉత్సాహం, అత్యవసర పరిస్థితిని సృష్టించి వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను సేకరించడం ఆర్థిక మోసాల్లో సాధారణంగా కనిపించే పద్ధతిగా ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.

ముఖ్యంగా బ్యాంక్ OTPను ఎవరితోనూ పంచుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పినా, బహుమతి వచ్చిందంటూ ఫోన్ చేసినా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ సమాచారం, OTP ఇవ్వకుండా అధికారిక మార్గాల్లోనే వివరాలను నిర్ధారించుకోవడం కీలకమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com