ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- November 20, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే Dh1,000 ఫైన్.. 6 బ్లాక్ పాయింట్లు
అబుదాబీ: యూఏఈలో ట్రాఫిక్ రద్దీ నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న షోల్డర్ మార్గాన్ని ఉపయోగిస్తూ ఇతర వాహనాలను ఓవర్టేక్ చేస్తున్నారు. అయితే ఈ విధానం అత్యంత ప్రమాదకరమని, ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అబుదాబీ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
శుక్రవారం (నవంబర్ 22) ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో పలువురు వాహనదారులు ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్‌పై వాహనాలు నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్టేక్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రద్దీని అధిగమించేందుకు రోడ్ షోల్డర్‌ను ఉపయోగించకూడదని పోలీసులు సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశముందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలు ప్రమాద స్థలాలకు చేరుకోవడంలో తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రోడ్ షోల్డర్‌పై వాహనాలను నడుపుతూ ఓవర్టేక్ చేస్తే Dh1,000 జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్లు విధిస్తారు.
ప్రతి వాహనదారుడు తమకు కేటాయించిన లేన్‌లోనే ప్రయాణించాలని, అత్యవసర సేవల వాహనాల కోసం రోడ్ షోల్డర్‌ను ఖాళీగా ఉంచాలని అబుదాబీ పోలీసులు స్పష్టం చేశారు.
రోడ్ షోల్డర్ పై వాహనాలు నిలిపినా ప్రమాదమే
ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా రోడ్ షోల్డర్‌పై వాహనాలను నిలపవద్దని అబుదాబీ పోలీసులు హెచ్చరించారు. వాహనం రోడ్డుపై నిలిపిన సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొన్న ఘటనకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వాహనం చెడిపోయినప్పుడు రోడ్డుకు దూరంగా సమీపంలోని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు.
దుబాయ్ పోలీసుల హెచ్చరిక.. 4,504 ఉల్లంఘనలు నమోదు
మరోవైపు దుబాయ్ పోలీసులు కూడా ఈ ఏడాది జూన్ 5న ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్‌పై వాహనాలు నడిపిన ఘటనలు ఈ ఏడాది ప్రారంభం నుంచి అప్పటివరకు 4,504 నమోదైనట్లు వెల్లడించారు.
రోడ్ షోల్డర్‌ను ఉపయోగించి ట్రాఫిక్‌ను దాటడం అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘనల్లో ఒకటని దుబాయ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ చర్య ఇతర వాహనదారుల భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుందని స్పష్టం చేశారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని యూఏఈ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!







