మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం

- September 26, 2026 , by Maagulf
మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం

ప్రపంచ శాంతి, సుహృద్భావం, మానవతా విలువలపై గజల్ గానంతో సందేశం

పోర్ట్ లూయిస్, మారిషస్: ప్రఖ్యాత గజల్ గాయకుడు, మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డుల గ్రహీత డా. గజల్ శ్రీనివాస్ మారిషస్ పర్యటనలో భాగంగా ఆ దేశ స్టేట్ హౌస్ (రాష్ట్రపతి భవన్)ను సందర్శించారు. మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ ఆహ్వానం మేరకు ఆయన స్టేట్ హౌస్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్‌తో పాటు మారిషస్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతినిధులను రాష్ట్రపతి సాదరంగా ఆహ్వానించారు. 2027 ఏప్రిల్‌లో మారిషస్‌లో నిర్వహించనున్న 5వ ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, లక్ష్యాలు, కార్యక్రమాల గురించి రాష్ట్రపతి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

గజల్ గానంతో శాంతి సందేశం

స్టేట్ హౌస్‌ను సందర్శించేందుకు వచ్చిన సీనియర్ సిటిజన్ల బృందాన్ని రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ స్వయంగా డా.గజల్ శ్రీనివాస్‌కు పరిచయం చేసి, వారికి సందేశం అందించాల్సిందిగా కోరారు.

రాష్ట్రపతి అభ్యర్థన మేరకు డా.గజల్ శ్రీనివాస్ సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం తన గజల్ గానం ద్వారా ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సుహృద్భావం, మానవతా విలువలు, దేశాల మధ్య స్నేహ సంబంధాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు.

తెలుగు గజల్స్‌లోని భావాలను సీనియర్ సిటిజన్లకు వివరించి ఆలపించగా, అవి అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీతం ద్వారా శాంతి, మానవతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.

గజల్ శ్రీనివాస్ సేవలను ప్రశంసించిన రాష్ట్రపతి

ఈ సందర్భంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ మాట్లాడుతూ, డా.గజల్ శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభినందించారు. ప్రపంచ శాంతి కోసం, వివిధ దేశాలు, ప్రజల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు.

గజల్ గానం, శాంతి యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శ్రీమద్భగవద్గీత ప్రచారం ద్వారా డా. గజల్ శ్రీనివాస్ అందిస్తున్న సేవలను రాష్ట్రపతి కొనియాడారు.

రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్‌తో పాటు ఆయన సతీమణి బృందా గోకుల్ కూడా డా. గజల్ శ్రీనివాస్ చేపడుతున్న విశ్వశాంతి, సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు.

అనంతరం మారిషస్ స్టేట్ హౌస్‌లో రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ డా.గజల్ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారత్–మారిషస్ మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలను మరింత బలోపేతం చేసే కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com