భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం

- October 02, 2026 , by Maagulf
భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: అమెరికాలో హెచ్-1బి (H-1B) వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లక్ష డాలర్ల భారీ ఫీజు విధానానికి న్యాయపరంగా మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫీజు వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని రెండో ఫెడరల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా తీర్పు అమెరికాలో ఉపాధి పొందుతున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు, ఇతర ప్రొఫెషనల్స్‌కు ఊరటనిచ్చింది.

నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టు స్పష్టీకరణ

నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫెడరల్ జడ్జి హేవూడ్ ఎస్. గిలియమ్ జూనియర్ ఈ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. ఫెడరల్ ఏజెన్సీలు ఈ ఫీజును అమలు చేసే క్రమంలో ‘అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్’ నిబంధనలను పాటించలేదని కోర్టు ఎత్తిచూపింది. వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యాసంస్థలు, తయారీ రంగ కంపెనీలు మరియు కార్మిక సంఘాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

H-1B Visa: ట్రంప్ నిర్ణయాలకు బ్రేక్.. భారతీయ నిపుణుల పై ప్రభావం

గత ఏడాది సెప్టెంబర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు మరియు గత నెలలో దానిని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాలను ఈ తీర్పు కట్టడి చేస్తుంది. హెచ్-1బి వీసాదారుల్లో సుమారు 71 శాతం మంది భారతీయులే ఉండటంతో, ఈ ఫీజు విధానం అత్యధికంగా వారిపైనే ప్రభావం చూపింది. ఈ లక్ష డాలర్ల ఫీజు కారణంగా భారతీయ పౌరుల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని సౌత్ ఏషియన్ అమెరికన్ జస్టిస్ కొలాబరేటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్పనా వి. పెద్దిభొట్ల అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానాలు

స్థానిక అమెరికన్ ఉద్యోగుల రక్షణ కోసమే ఈ ఆంక్షలు విధించామని ట్రంప్ సర్కార్ వాదిస్తున్నప్పటికీ, న్యాయస్థానాలు ఆ వాదనతో ఏకీభవించడం లేదు. కాగా, హెచ్-1బి ఫీజు నిలిచిపోవడం ఇది రెండోసారి. గతేడాది జూన్‌లో మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు కూడా ఇదే విధంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వం అప్పీల్ చేసినప్పటికీ కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తాజా తీర్పుతో ట్రంప్ యంత్రాంగానికి మరోసారి చుక్కెదురైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com