మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!

- October 02, 2026 , by Maagulf
మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!

దోహా: సౌదీ అరేబియాలోని మదీనాలో ప్రవక్త మసీదు (Prophet’s Mosque)తో పాటు పౌర సదుపాయాలకు విద్యుత్ సరఫరా చేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్‌ను హౌతీ గ్రూప్ లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది.

ఇస్లామిక్ పవిత్ర స్థలాల పవిత్రతను ఉల్లంఘించేలా జరిగిన ఈ దాడి.. ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే చర్యగా ఖతార్ పేర్కొంది. పౌరుల ప్రాణాలను పట్టించుకోకపోవడం, సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, అంతర్జాతీయ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించడం వంటి తీవ్రమైన చర్యగా అభివర్ణించింది.

పవిత్ర స్థలాలు, పౌర మౌలిక సదుపాయాలు, పౌరులపై జరిగే దాడులను ఖతార్ ప్రభుత్వం పూర్తిగా తిరస్కరిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి బాధ్యతారహిత చర్యలను వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చింది.

అదే సమయంలో సౌదీ అరేబియాకు ఖతార్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. సౌదీ సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రత, ప్రయోజనాలను కాపాడేందుకు సౌదీ తీసుకునే చట్టబద్ధమైన అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

సౌదీ అరేబియా భద్రత తమ దేశ భద్రతలో అంతర్భాగమని ఖతార్ పేర్కొంది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల సమిష్టి భద్రతా వ్యవస్థలోనూ సౌదీ భద్రత కీలక భాగమని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com