‘ది ట్రెయిటర్స్' తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

- October 06, 2026 , by Maagulf
‘ది ట్రెయిటర్స్\' తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

‘ది ట్రెయిటర్స్'తో ఎక్సైట్మెంట్, థ్రిల్ ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజ సజ్జ.

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో, ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌కు ట్రైలర్ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. చిన్మయీ శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యూ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డి'సౌజా, ప్రణవ్ అలియాస్ అభినవకవి, ఎస్‌ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ, ఫాల్గుణి బంగేరా ఈ షోలో పాల్గొంటున్నారు.

స్టార్ హీరో తేజ సజ్జ రియాలిటీ షో హోస్ట్‌గా తొలిసారి పరిచయం అవుతున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో పోటీదారులు నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? అనే ప్రశ్నల చుట్టూ గేమ్ సాగుతుంది. SOL Production నిర్మించిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తెలుగులో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది.

‘ది ట్రెయిటర్స్ తెలుగు’, ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘ది ట్రెయిటర్స్ హిందీ’ సీజన్ 2 విజయానికి కొనసాగింపుగా వస్తోంది. ‘ది ట్రెయిటర్స్ హిందీ’ సీజన్ 2 తన విడుదలైన వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో అత్యధికంగా చుసిన నాన్-ఇంగ్లీష్ టైటిల్‌గా నిలిచింది.

ట్రైలర్ ప్రేక్షకులను ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇందులో పోటీదారులు, వ్యూహాత్మక మోసాలతో కూడిన గేమ్‌లోకి అడుగుపెడతారు. ‘ఇన్నోసెంట్స్’ తమలో దాగి ఉన్న ట్రెయిటర్స్‌ను సమయం ముగిసేలోపు గుర్తించాలి. స్నేహాలు పరీక్షకు గురవుతాయి. నమ్మకాలు మారిపోతాయి. ప్రతి సంభాషణ, ఆరోపణ, పొత్తు వెనుక ఒక రహస్య ఉద్దేశం ఉండొచ్చు. ఈ మొత్తం గేమ్‌కు కేంద్రబిందువుగా ఉన్న తేజ సజ్జ తన ఎనర్జీ, స్పాంటేనిటీతో పోటీదారులను, ప్రేక్షకులను ముందుకు నడిపిస్తారు. ఇక్కడ కనిపించేది ఏదీ పూర్తిగా అనుకున్నట్లుగా ఉండదు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ హోస్ట్ తేజ సజ్జ మాట్లాడుతూ: “ ది ట్రెయిటర్స్ తో ఎక్సైట్మెంట్, థ్రిల్ ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫార్మేట్ నాకు చాలా నచ్చింది. ఇది చాలా పెద్ద హిట్ షో. అన్ని భాషల్లో చాలా పెద్ద విజయం సాధించింది. తెలుగులో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. ది ట్రెయిటర్స్ తెలుగు హోస్ట్‌గా వ్యవహరించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. 

నేను ఇంతకుముందు చేసిన వాటికి పూర్తి భిన్నమైన కార్యక్రమంలో భాగం కావడం నిజంగా చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఫార్మాట్‌కు తొలి తెలుగు ఎడిషన్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. 

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది ఒక బిగ్ మూమెంట్ అని నేను భావిస్తున్నాను. ఒక అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఫార్మాట్‌ను మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు, దానికి మనదైన వ్యక్తిత్వం, మనదైన ఫ్లేవర్‌ను అందిస్తున్నాం. నిజం చెప్పాలంటే, ఈ గేమ్ పోటీదారులకు ఎంత అనూహ్యంగా ఉంటుందో హోస్ట్‌గా నాకు కూడా అంతే అనూహ్యంగా ఉంటుంది. ఒక గదిలోకి వెళ్లినప్పుడు ఎవరిని నమ్మాలో పూర్తిగా తెలుసు అనుకుంటాం. కానీ కొన్ని నిమిషాల్లోనే మొత్తం పరిస్థితి మారిపోవచ్చు.

అదే ఈ ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ గేమ్‌ను ఇంత సరదాగా మారుస్తుంది. అబద్ధాలు, మైండ్ గేమ్స్, ఊహించని పొత్తులు, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు.. ఇవన్నీ ఈ షోలో భాగం. . ప్రేక్షకులు కూడా ఇందులోని పోటీదారులతో కనెక్ట్ అయి, గేమ్ ఎలా ముందుకు సాగుతుందో ఆసక్తిగా గమనిస్తూ తమకు నచ్చిన విధంగా ఊహించుకుంటారని ఎదురుచూస్తున్నాను.”

డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో (SVOD), అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ.. “ ట్రైటర్స్ పాప్ కల్చర్ లో చాలా పెద్ద హిట్ షో. హిందీలో రెండు హిట్ సీజన్ల తర్వాత ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎడిషన్‌ను లీడ్ చేయడానికి తేజ సజ్జ అద్భుతమైన హోస్ట్. ఆయన చరిష్మా, స్పాంటేనియిటీ, ప్రేక్షకులతో సహజమైన కనెక్షన్ ఈ షోకు ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను తీసుకొస్తాయి. ‘ది ట్రైటర్స్ తెలుగు’ ద్వారా ఈ ఫ్రాంచైజ్‌ను మరింత విస్తరించి, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం.”

పార్ట్‌నర్ అండ్ కో-ఫౌండర్, SOL ప్రొడక్షన్స్ ఫజీల మాట్లాడుతూ.. ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో అనందంగా వుంది. ప్రైమ్ వీడియోతో కలిసి మేము రూపొందించిన ఈ షోపై ఎంతో గర్వంగా ఉన్నాం. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ను ఎంచుకుంటారని ఎదురుచూస్తున్నాం. ఈ షో మీ అందరినీ అలరించేలా వుంటుంది. ఈ ఈవెంట్ లో పార్టిసిపెంట్స్ పాల్గొని తమ ఆనందాన్ని, షో పట్ల ఉత్సాహన్ని పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com