యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!

- October 07, 2026 , by Maagulf
యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!

దుబాయ్‌: ప్రజల పోషకాహార ప్రమాణాలను మెరుగుపరచడం, ఊబకాయం సహా అంటువ్యాధులు కాని వ్యాధుల నియంత్రణ లక్ష్యంగా యూఏఈ ప్రభుత్వం పలు ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల్లో సోడియం, చక్కెర, కొవ్వు పరిమితులను కొత్తగా నిర్దేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే ఆహార సంస్థలకు హెచ్చరికతో పాటు Dh5,000 నుంచి Dh500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. స్థానికంగా తయారయ్యే లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నిర్దిష్ట ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఫ్రీజోన్లలో పనిచేసే కంపెనీలు కూడా వీటి పరిధిలోకి వస్తాయి. బ్రెడ్‌, చక్కెర కలిపిన పాల పానీయాలు, ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌, లబాన్‌, ఉప్పగా ఉండే స్నాక్స్‌, ప్రాసెస్డ్‌ చీజ్‌ వంటి ఉత్పత్తుల్లో దశలవారీగా సోడియం, చక్కెర, కొవ్వు స్థాయులను తగ్గించాల్సి ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నిబంధనలు పాటించని సంస్థలపై Dh5,000 నుంచి Dh500,000 వరకు పరిపాలనా జరిమానాలు విధించవచ్చు. అవసరమైతే సంస్థను ఆరు నెలల వరకు మూసివేయడంతో పాటు, పరిస్థితిని బట్టి ఆ మూసివేతను పొడిగించవచ్చు. సంబంధిత లైసెన్సింగ్‌ అథారిటీతో సమన్వయం చేసి సంస్థ లైసెన్స్‌ లేదా అనుమతిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఆహార ఉత్పత్తుల పోషక విలువను మెరుగుపరచడం, ప్రజలు సమతుల్యమైన ఆహార ఎంపికలు చేసుకునేలా ప్రోత్సహించడం ఈ కొత్త విధాన లక్ష్యమని యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్పత్తి, తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, రవాణా, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం వరకు ఆహార సరఫరా గొలుసులోని అన్ని దశలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. యూఏఈ నుంచి నేరుగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది. అయితే అవి యూఏఈలోనే విక్రయిస్తే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

బ్రెడ్‌, పాల ఉత్పత్తులకు కొత్త పరిమితులు
కొత్త నిబంధనల్లో ఆహార ఉత్పత్తులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో బ్రెడ్‌, చక్కెర కలిపిన పాల పానీయాలు, ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌, లబాన్‌, కొన్ని ఉప్పగా ఉండే స్నాక్స్‌ ఉన్నాయి. రెండో వర్గంలో ప్రాసెస్డ్‌ చీజ్‌ను చేర్చారు.లీవెన్డ్‌ బ్రెడ్‌ లో 100 గ్రాములకు మొదటి దశలో సోడియం 444 మిల్లీగ్రాములు, మొత్తం చక్కెర 6 గ్రాములు, కొవ్వు 8.4 గ్రాములకు మించకూడదు. తుది దశలో ఇవి వరుసగా 370 మి.గ్రా., 5 గ్రాములు, 7 గ్రాములకు తగ్గించాలి. అలాగే ఫ్లాట్‌ బ్రెడ్‌లో మొదటి దశ పరిమితులు 384 మి.గ్రా. సోడియం, 6 గ్రాముల చక్కెర, 8.4 గ్రాముల కొవ్వుగా ఉండగా.. తుది దశలో ఇవి 320 మి.గ్రా., 5 గ్రాములు, 7 గ్రాములకు తగ్గించాలి.  చక్కెర కలిపిన పాల పానీయాలు, పాల ప్రత్యామ్నాయాల్లో మొత్తం చక్కెర పరిమితి మొదటి దశలో 9.6 గ్రాములు, తుది దశలో 8 గ్రాములుగా ఉంటుంది. చక్కెర కలిపిన లేదా ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌, లబాన్‌లో ఈ పరిమితులు వరుసగా 12 గ్రాములు, 10 గ్రాములు.

ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్‌పైనా పరిమితులు
సాల్టెడ్‌ క్రాకర్స్‌లో సోడియం పరిమితిని 696 మి.గ్రా. నుంచి 580 మి.గ్రా.కు, సాల్టెడ్‌ నట్స్‌, సీడ్స్‌లో 336 మి.గ్రా. నుంచి 280 మి.గ్రా.కు తగ్గించనున్నారు. ప్రెట్జెల్స్‌లో పరిమితి 912 మి.గ్రా. నుంచి 760 మి.గ్రా.కు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, కూరగాయలు లేదా ధాన్యాలతో తయారు చేసే ఎక్స్‌ట్రూడెడ్‌ స్నాక్స్‌, చిప్స్‌లో 564 మి.గ్రా. నుంచి 470 మి.గ్రా.కు తగ్గుతుంది. ప్రాసెస్డ్‌ చీజ్‌లో స్ప్రెడబుల్‌ చీజ్‌కు మొదటి దశలో గరిష్ఠ సోడియం పరిమితి 864 మి.గ్రా., తుది దశలో 720 మి.గ్రా.గా ఉంటుంది. ఇతర ప్రాసెస్డ్‌ చీజ్‌లలో ఈ పరిమితి 1,200 మి.గ్రా. నుంచి 1,000 మి.గ్రా.కు తగ్గుతుంది.

కంపెనీలకు..
బ్రెడ్‌, పాల పానీయాలు, యోగర్ట్‌, లబాన్‌, సాల్టీ స్నాక్స్‌ వంటి మొదటి వర్గ ఉత్పత్తులను నిర్వహించే సంస్థలకు మొదటి దశ పరిమితులను అమలు చేసేందుకు నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 9 నెలల వరకు గడువు ఉంటుంది. అనంతరం దశలవారీగా తగ్గిస్తూ 2030 డిసెంబర్‌ 31 నాటికి తుది పరిమితులను చేరుకోవాలి. ప్రాసెస్డ్‌ చీజ్‌ ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలకు మొదటి దశ పరిమితులను పాటించేందుకు 2 సంవత్సరాల 3 నెలల వరకు గడువు ఉంటుంది. ఇవి కూడా 2030 డిసెంబర్‌ 31 నాటికి తుది పరిమితులకు చేరుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com