రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

- October 07, 2026 , by Maagulf
రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించి, రాష్ట్ర పురోగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ఈ హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో భేటీ కానున్నారు. ప్రధానంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రధానిని కోరనున్నారు. అలాగే, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల దృష్ట్యా బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేయనున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, జలవనరుల శాఖల సహకారం

వచ్చే ఏడాది ఘనంగా జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని, అలాగే రాయలసీమను వ్యవసాయ రంగాన అగ్రగామిగా నిలిపే ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపే చర్చల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. మరోవైపు, గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళుతున్న మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నదుల అనుసంధానం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేయించడం వంటి కీలక జలవనరుల అంశాలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వేదికగా భారత పరిశ్రమల సమాఖ్య (CII) నిర్వహించే ‘భాగస్వామ్య సదస్సు’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు భాగస్వామ్యమవుతారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం రేపు రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com