హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- October 10, 2026
హైదరాబాద్: హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం కేవలం అలైన్‌మెంట్ అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక దశలో హైస్పీడ్ రైల్ పేరుతో ఎవరైనా భూసేకరణకు పాల్పడితే అది పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుందని తేల్చి చెప్పింది.
కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ భేటీ
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్‌ను ఇతర నగరాలతో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైల్ కారిడార్ల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కిషన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రజలతో పంచుకున్నారు.
“రైల్వే మంత్రి స్పష్టం చేసిన దాని ప్రకారం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి భూసేకరణ అభ్యర్థనలు పంపలేదు. ఈ దశలో హైస్పీడ్ రైల్ పేరుతో జరుగుతున్న ఏ భూసేకరణ అయినా చట్టవిరుద్ధం” అని కిషన్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టుల అలైన్‌మెంట్ పూర్తిగా ఖరారైన తర్వాతే ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో, రైతులతో పంచుకోవడం జరుగుతుందని రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో స్పష్టత
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రైల్ కారిడార్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూసేకరణ ప్రయత్నాలను స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ స్పష్టత రావడం గమనార్హం.
మరోవైపు కిషన్ రెడ్డితో జరిగిన సమావేశంపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. హైదరాబాద్‌ను మూడు ప్రధాన నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్ కనెక్టివిటీకి సంబంధించిన ప్రతిపాదిత అలైన్‌మెంట్‌పై ఇరువురు మంత్రుల మధ్య చర్చలు జరిగాయని సోషల్ మీడియాలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధిలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం పెంచడంతో పాటు, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ (Kavach) ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థను వేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







