యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!

- October 10, 2026 , by Maagulf
యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!

ఫుజైరా: యూఏఈలో తెరిచి ఉన్న, నిరుపయోగంగా మారిన బావుల వల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు చేపట్టారు. బావుల యజమానులు వాటిని వెంటనే పటిష్ఠమైన మూతలతో మూసివేయాలని, చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని పోలీసులు, సివిల్‌ డిఫెన్స్‌, మున్సిపల్‌ అధికారులు సూచించారు. ఫుజైరాలోని మెరాషిద్‌ ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు, 25 ఏళ్ల గృహ కార్మికురాలు ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

బాలుడిని కాపాడిన కార్మికురాలు

కుటుంబానికి చెందిన ప్రైవేట్‌ బావిపై చెక్క పలకలు, పెద్ద రాళ్లతో తాత్కాలికంగా మూత ఏర్పాటు చేశారు. దానిపై బాలుడు అడుగుపెట్టడంతో మూత కూలిపోయి బాలుడు, గృహ కార్మికురాలు బావిలో పడిపోయారు. బావిలో చీకటి, నీరు ఉన్నప్పటికీ డొమెస్టిక్ వర్కర్  బాలుడిని గట్టిగా పట్టుకుని, అతడి తల నీటిపై ఉండేలా చూసుకున్నారు. అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకునే వరకు బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు.

ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. మరుసటి రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. బాలుడిని కాపాడే క్రమంలో ఆ వర్కర్ కాలుకు ఫ్రాక్చర్‌ అయింది. ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతోంది.

 బావుల యజమానులకు అధికారుల హెచ్చరిక

ఫుజైరా సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ ఖాలెద్‌ రబీ అల్‌ హమూది మాట్లాడుతూ..  ఇళ్ల యజమానులు, వ్యవసాయ భూముల నిర్వాహకులు బావుల వద్ద తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- బావులపై బలమైన, పటిష్ఠమైన మూతలు ఏర్పాటు చేయాలి.

- బావుల చుట్టూ రక్షణ కంచెలు నిర్మించాలి.

- ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

- నిరుపయోగంగా ఉన్న లేదా ప్రమాదకరంగా కనిపించే బావుల సమాచారాన్ని స్థానిక మున్సిపాలిటీ లేదా సివిల్‌ డిఫెన్స్‌కు తెలియజేయాలి.

తెరిచి ఉన్న బావులు పిల్లలతో పాటు పెద్దల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని ఫుజైరా పోలీసులు హెచ్చరించారు.

పలు ప్రాంతాల్లో తనిఖీలు

యూఏఈలోని వివిధ ఎమిరేట్లలో పోలీసులు, మున్సిపల్‌ అధికారులు నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములు, వెలుతురు తక్కువగా ఉండే ఎడారి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అల్‌ దైద్‌: వ్యవసాయ భూములు, చీకటిగా ఉండే ప్రాంతాల్లో కనిపించకుండా ఉన్న బావులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేలు చేపట్టారు. సాంకేతిక పరిశీలన అనంతరం నిరుపయోగ బావులను మట్టితో పూర్తిగా పూడ్చివేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

అల్‌ ఐన్‌: నగర మున్సిపాలిటీ ఎనిమిది ప్రాంతాల్లో తొమ్మిది నిరుపయోగ ఆర్టీసియన్‌ బావులను గుర్తించి పూడ్చివేసినట్లు గతంలో ప్రకటించింది. ఇళ్ల సమీపంలోని ఇసుక ప్రాంతాలు, ఎడారి పరిసరాల్లో పిల్లలు, పశువులకు ప్రమాదాలు జరగకుండా భారీ యంత్రాలను వినియోగించారు.

కల్బా: గతంలో నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేట్‌ ఇళ్లు, వ్యవసాయ భూముల పరిసరాల్లో సుమారు 10 నిరుపయోగ బావులను గుర్తించి పూడ్చివేశారు. మరో తనిఖీ కార్యక్రమంలో 20 వరకు బావులను లక్ష్యంగా చేసుకున్నారు.

గతంలోనూ బావుల వల్ల ప్రమాదాలు

యూఏఈలో గతంలోనూ బావుల్లో పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

* 2010 – మజీద్‌, అల్‌ ఐన్‌: ఇంటి ప్రాంగణంలోని 11 మీటర్ల లోతైన బావిలో పడిన మూడేళ్ల బాలుడిని సజీవంగా రక్షించారు.

* 2014 – అల్‌ వహ్లా, ఫుజైరా: బావిలో పడిన ఏడేళ్ల బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడు, బాలుడు ఇద్దరూ మునిగి మరణించారు.

* 2016 – అల్‌ నైఫా, హిలీ: నివాస ప్రాంగణంలో చెక్కలతో ఏర్పాటు చేసిన బావి వేదిక కూలిపోవడంతో ముగ్గురు పిల్లలు మరణించగా, మరో చిన్నారిని రక్షించారు.

* 2017 – అల్‌ బిద్యా, ఫుజైరా: కుటుంబ ఇంటి వద్ద లోతైన ఆర్టీసియన్‌ బావిలో పడిన ఎనిమిదేళ్ల బాలుడిని పోలీసులు రక్షించారు.

నివాసితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చెక్కలు, వదులుగా ఉన్న ఇటుకలతో బావులను కప్పకుండా కాంక్రీట్‌ లేదా వెల్డెడ్‌ స్టీల్‌తో తయారుచేసిన పటిష్ఠమైన మూతలను ఉపయోగించాలని తెలిపారు. బావుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని, పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com