యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్‌.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!

- October 13, 2026 , by Maagulf
యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్‌.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!

యూఏఈ: నాణ్యతాపరమైన సమస్యలు గుర్తించడంతో నిర్దిష్ట బ్యాచ్‌కు చెందిన ఫేస్ మాస్కులను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకోవాలని ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (EDE) ఆదేశించింది. Nin 160 FMB-NML బ్లూ త్రీ-ప్లై ఫేస్ మాస్కులు, బ్యాచ్ నంబర్ 20251015పై ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ రీకాల్‌ ప్రకటించింది. సదరు బ్యాచ్‌కు చెందిన మాస్కుల నాణ్యతపై ఫిర్యాదు అందడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని మాస్కుల్లో విదేశీ పదార్థాలు లేదా కలుషితాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

మాస్కుల వినియోగం నిలిపివేయాలని సూచన

దుబాయ్ ఆరోగ్య శాఖ (DHA) ప్రైవేట్ ఆరోగ్య రంగంలోని వైద్య సంస్థలు, వైద్య నిపుణులకు సర్క్యులర్ జారీ చేసింది. EDE జారీ చేసిన రీకాల్‌ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ప్రభావిత బ్యాచ్‌కు చెందిన మాస్కులను విక్రయించడం, సరఫరా చేయడం, పంపిణీ చేయడం, వినియోగించడం వెంటనే నిలిపివేయాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, తమ వద్ద ఉన్న మాస్కుల నిల్వలను గుర్తించి వేరుగా భద్రపరచాలని, సరఫరాదారులకు తిరిగి పంపించాలని సూచించారు. గుర్తించిన, నిల్వ ఉంచిన, తిరిగి పంపిన మాస్కుల పరిమాణాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించాలని తెలిపారు.

పంపిణీ చేసిన మాస్కులను వెనక్కి తీసుకోవాలని ఆదేశం

ప్రభావిత బ్యాచ్‌కు చెందిన మాస్కులను యూఏఈ మార్కెట్‌ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకోవాలని పంపిణీదారుని EDE ఆదేశించింది. తిరిగి వచ్చిన మాస్కులతో పాటు మిగిలిన నిల్వలను కూడా వేరుగా భద్రపరచాలని, వాటి తదుపరి పంపిణీని నిలిపివేయాలని పేర్కొంది. దీనికి సంబంధించి దిగుమతి చేసుకున్న, పంపిణీ చేసిన, తిరిగి వచ్చిన, ప్రస్తుతం నిల్వలో ఉన్న మాస్కుల వివరాలతో పాటు యూఏఈలో పంపిణీ చేసిన ప్రాంతాల పూర్తి జాబితాను అధికారులకు అందించాలని సూచించింది.

ప్రజలకు కీలక సూచన

యూఏఈలోని ప్రజలు బ్యాచ్ నంబర్ 20251015 ఉన్న మాస్కులను వెంటనే ఉపయోగించడం నిలిపివేయాలని అధికారులు సూచించారు. కొనుగోలు చేసిన దుకాణం లేదా సరఫరాదారుకు వాటిని తిరిగి ఇవ్వాలని కోరారు. ప్రభావిత మాస్కుల వల్ల ఏదైనా అనారోగ్య సమస్య లేదా ఇతర ప్రతికూల ఘటన ఎదురైతే, సంబంధిత అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని వైద్య సంస్థలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com