కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!

- October 16, 2026 , by Maagulf
కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!

కువైట్ : కువైట్‌లో వారాంతంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గనున్నాయి. అదే సమయంలో గాలిలో తేమ పెరగడంతో తీర ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. శనివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పగటిపూట వేడి వాతావరణం, రాత్రివేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని పేర్కొంది.

కువైట్ ప్రస్తుతం ఆటమ్ సీజన్‌లోకి ప్రవేశించిందని, ఈ సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ ధిరార్ అల్ అలీ తెలిపారు. తీర ప్రాంతాల్లో గాలిలో తేమ పెరుగుతోందని, గాలి ద్రవ్యరాశుల్లో మార్పుల కారణంగా తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. అప్పుడప్పుడు ఆకాశంలో మేఘాలు కూడా కనిపించవచ్చన్నారు.

నేడు పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. గాలులు గంటకు 8 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. రాత్రివేళల్లో వాతావరణం మోస్తరుగా, తేమతో కూడి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

శనివారం పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. గాలులు గంటకు 8 నుంచి 32 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సాయంత్రం వేళల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు పొగమంచు కూడా ఏర్పడవచ్చు. రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. ఆకాశం అక్కడక్కడా మేఘావృతమై ఉండవచ్చు. సముద్రంలో అలల ఎత్తు 1 నుంచి 3 అడుగుల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com