ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!

- October 17, 2026 , by Maagulf
ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!

దోహా: ఖతార్‌లో వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) దేశవ్యాప్తంగా 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలను అందిస్తోంది. 50 ఏళ్లు పైబడిన అర్హులైన ఖతార్ పౌరులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులు ఈ సేవలను పొందవచ్చు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని PHCC అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా గృహ వైద్య సేవలు పొందుతున్న వృద్ధులను వారి ఇళ్లలోనే వైద్య సిబ్బంది పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులతో మాట్లాడటంతో పాటు వారికి ప్రతీకాత్మక బహుమతులను అందజేశారు.

వృద్ధుల గౌరవాన్ని కాపాడటం, వారి స్వతంత్ర జీవనాన్ని ప్రోత్సహించడం, సమాజంలో చురుకైన భాగస్వాములుగా కొనసాగేలా చేయడం సమగ్ర వైద్య సంరక్షణలో కీలకమని PHCC పేర్కొంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

అలాగే వృద్ధులకు అందాల్సిన ఆరోగ్య, సామాజిక సేవలు, వారి హక్కులు, సురక్షితమైన సమగ్ర వైద్య సంరక్షణ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వృద్ధులకు సేవలు అందించే వివిధ సంస్థల వివరాలను తెలియజేస్తూ, ఆయా సంస్థల మధ్య సమన్వయం, భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.

25 ఆరోగ్య కేంద్రాల్లో సేవలు

ఖతార్‌లోని 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రస్తుతం హోమ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని PHCC వెల్లడించింది. ఆమోదించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అర్హులైన ఖతార్ పౌరులు, GCC దేశాల పౌరులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ సేవలను వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణుల బృందం సమన్వయంతో అందిస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com