ప్రిస్క్రిప్షన్ల పరిశీలన, మందుల భద్రత ఫార్మసిస్టర్ల బాధ్యతలు..!!

- October 23, 2026 , by Maagulf
ప్రిస్క్రిప్షన్ల పరిశీలన, మందుల భద్రత ఫార్మసిస్టర్ల బాధ్యతలు..!!

రియాద్: మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లు క్షుణ్ణంగా పరిశీలించడం, మందుల భద్రతను నిర్ధారించడం ఫార్మసిస్టర్ల ప్రధాన బాధ్యతలని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, చికిత్సకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తితే వృత్తిపరమైన ప్రమాణాలను పాటిస్తూ తగిన మార్గాల్లో వాటిని పరిష్కరించుకోవాలని సూచించింది.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘937’ ఎక్స్‌ (X) ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

వైద్య వృత్తుల నిర్వహణ చట్టంలోని ఆర్టికల్ 23 ప్రకారం, మందుల ప్రిస్క్రిప్షన్‌లో పొరపాటు జరిగిందనే అనుమానం ఉన్నప్పుడు ఫార్మసిస్టులు ఆ మందులను పంపిణీ చేయరాదని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో తదుపరి చర్య తీసుకునే ముందు ప్రిస్క్రిప్షన్‌ రాసిన వైద్యుడిని సంప్రదించి స్పష్టత పొందాలని తెలిపింది. అలాగే, ప్రిస్క్రిప్షన్‌ రాసిన వైద్యుడి అనుమతి లేకుండా అందులోని వివరాలను ఫార్మసిస్టులు మార్చకూడదని స్పష్టం చేసింది. అయితే, సమానమైన ప్రత్యామ్నాయ మందుల పంపిణీకి సంబంధించి నిబంధనల్లో అనుమతించిన మినహాయింపులను పాటించాల్సి ఉంటుందని వివరించింది.

చికిత్సకు సంబంధించి వైద్య సిబ్బంది మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు వృత్తిపరమైన నైతిక విలువలను పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వైద్య వృత్తుల నిర్వహణ చట్టంలోని ఆర్టికల్ 24 ప్రకారం, ఆరోగ్య సంరక్షణ నిపుణులు పరస్పరం సహకరించుకోవడంతో పాటు  ఒకరిపై మరొకరు నమ్మకాన్ని కలిగి ఉండాలని పేర్కొంది. సహోద్యోగులను కించపరచడం, దూషించడం వంటి చర్యలను చట్టం నిషేధిస్తుందని తెలిపింది. చికిత్సకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను శాస్త్రీయ ఆధారాలతో, వృత్తిపరమైన గౌరవంతో తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని సూచించింది. దీనివల్ల రోగుల భద్రతను కాపాడటంతో పాటు వైద్య బృందంపై రోగులకు నమ్మకం పెరుగుతుందని పేర్కొంది.

ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను ఉల్లంఘిస్తే, అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ వైద్య రంగంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com