మళ్లీ తెరపైకి పదేళ్ల నాటి ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన..!!
- October 23, 2026
మనామా: ది అవెన్యూస్ మాల్ వద్ద పనిచేసే ఉద్యోగులు సహా పలువురు పెడెస్టేరియన్స్ రాత్రి వేళల్లో కింగ్ ఫైసల్ హైవేను దాటేందుకు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ ఖరాటా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పాదచారుల భద్రత కోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్న పదేళ్ల నాటి ప్రతిపాదనను ఆయన మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.
కేపిటల్ రెండో నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వాటర్‌ఫ్రంట్‌తో అనుసంధానించేలా ఈ బ్రిడ్జి నిర్మించాలని ఖరాటా కోరారు. ముఖ్యంగా షెరటాన్ హోటల్ జంక్షన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రద్దీగా ఉండే రహదారిని దాటుతున్నారని, వేగంగా వెళ్లే వాహనాల కారణంగా ప్రమాదాల ముప్పు పొంచి ఉందని తెలిపారు.
ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన 2014లోనే తెరపైకి వచ్చింది. అప్పట్లో ఖరాటాతో పాటు మరో నలుగురు ఎంపీలు ఇదే జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వేగంగా ప్రయాణించే వాహనాల మధ్య రహదారిని దాటడం ప్రజలకు ప్రమాదకరంగా మారుతోందని వారు హెచ్చరించారు.
అయితే, ఆ సమయంలో అక్కడ రహదారిని దాటే పాదచారుల సంఖ్య తక్కువగా ఉందని, బ్రిడ్జి నిర్మాణాన్ని సమర్థించే స్థాయిలో రాకపోకలు లేవని పనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని విస్తరించిన రహదారికి అనుగుణంగా పొడిగించినట్లు కూడా వివరించింది. తాజాగా ప్రభుత్వ సమాధానంలో కింగ్ ఫైసల్ హైవే ఆధునికీకరణ ప్రణాళికల్లో భాగంగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. షెరటాన్ జంక్షన్ వద్ద హైవే, ప్యాలెస్ అవెన్యూ కలిసే ప్రాంతంలో పాదచారులు రహదారిని దాటేందుకు వీలుగా ట్రాఫిక్ సిగ్నళ్లలో మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
వాటర్‌ఫ్రంట్ ప్రాంతానికి సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు పాదచారులకు రహదారి దాటే సమయంలో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుత క్రాసింగ్ ఏర్పాట్లతో ఎంపీలు కోరిన సురక్షిత మార్గం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది.
అయితే, పాదచారుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- హౌతీల వాదనను ఖండించిన సౌదీ నేతృత్వంలోని కూటమి..!!
- కువైట్ లో 2వేల కంపెనీల లైసెన్స్ సస్పెండ్..!!
- యూఏఈలో ఐఫోన్ డ్యుయోకు భారీ డిమాండ్..!!
- ఒమన్ సముద్ర జలాల్లో పింక్ డాల్ఫిన్..!!
- అక్టోబర్ 31 వరకు సౌదీ అరేబియాకు ఇండిగో విమాన సర్వీసుల రద్దు
- మళ్లీ తెరపైకి పదేళ్ల నాటి ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన..!!
- దుబాయ్‌లో 27వ అంతర్ పాఠశాలల డిబేట్ కాంపిటీషన్ ఫైనల్
- భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్..
- అమెరికా వర్క్ వీసా నిబంధనల పై మార్కో రూబియో వివరణ
- ప్రాంతీయ అంతరాయాలు.. నవంబర్ 5 వరకు సౌదీ అరేబియా విమానాలను రద్దు చేసిన ఎతిహాద్







