100 డేస్ ఆఫ్ లవ్ : రివ్యూ
- August 26, 2016
సినిమాపేరు: 100 డేస్ ఆఫ్ లవ్
నటీనటులు: దుల్కర్ సల్మాన్.. నిత్యమేనన్.. శేఖర్ మేనన్.. అజు వర్గీస్.. వినీత్.. ప్రవీణ.. రాహుల్ మాధవ్.. వి.కె.ప్రకాష్.. అభిరామి సురేష్.. జాకబ్ గ్రెగరీ తదితరులు
ఛాయాగ్రహణం: ప్రతీష్ వర్మ
కూర్పు: సందీప్ కుమార్
సంగీతం: గోవింద్ మేనన్..
బిజిబల్
పాటలు: కృష్ణచైతన్య
నిర్మాత: ఎస్.వెంకటరత్నం
దర్శకత్వం: జీనస్ మహమ్మద్
సంస్థ: ఎస్.ఎస్.సి.మూవీస్
విడుదల: 26-08-2016
దక్షిణాదిలో మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకొనే జంటగా పేరు తెచ్చుకొన్నారు.. దుల్కర్ సల్మాన్.. నిత్యమేనన్. 'ఓకే బంగారం'తో వాళ్లు చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. చిరు నవ్వులతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసే నిత్యమేనన్.. పాత్రల్లో అత్యంత సహజంగా ఇమిడిపోయే దుల్కర్ ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతుంటారు. ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రమే '100 డేస్ ఆఫ్ లవ్'. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దుల్కర్, నిత్యల జంట మరోసారి తన మేజిక్‌ని ప్రదర్శించిందా? లేదా తెలవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: వైద్యుల కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు రావుగోపాలరావు (దుల్కర్ సల్మాన్). ఓ పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేస్తుంటాడు. కార్టూనిస్ట్ కావడమే అతడి లక్ష్యం. ఉన్నట్టుండి ఒకరోజు టాక్సీలో సావిత్రి (నిత్యమేనన్)ని చూస్తాడు, ప్రేమలో పడతాడు. అక్కడే సావిత్రికి చెందిన కెమెరా పడిపోతుంది. అందులో ఉన్న రీల్‌ని కడిగించి ఆ ఫొటోలతో సావిత్రి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. అనుకోకుండా సావిత్రి తారసపడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారతారు.
రావు గోపాలరావు తన ప్రేమ విషయం చెప్పాలనుకొనేలోపే రాహుల్ (రాహుల్ మాధవ్)తో పెళ్ళికి ఒప్పుకొంటుంది సావిత్రి. కానీ తన ప్రేమ విషయం చెబుతాడు. బంధాలు నిలబడాలంటే స్థిరత్వం.. ఆస్తి.. అంతస్థు ఇవన్నీ ముఖ్యమనుకొనే సావిత్రి.. స్థిరత్వం లేకుండా.. వాస్తవంగా బతికే రావు గోపాలరావు ప్రేమని ఒప్పుకొందా లేదా అనేది తెరపైనే చూడాలి. ఎలా ఉందంటే?: సినిమాల్లోలాగా నిజ జీవితంలో ప్రేమకథలు సుఖాంతం కావంటూ రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు చెప్పే తన వందరోజుల ప్రేమకథే ఈ చిత్రం. తన కథని నిరాశగా మొదలుపెట్టిన ఆ యువకుడి జీవితం చివరికి ఎలా మలుపు తిరిగిందన్నది తెరపైనే చూడాలి. ఇందులోని కథగానీ.. కథనంగానీ ఏమాత్రం కొత్తగా అనిపించవు. ప్రతి సన్నివేశాన్ని తెరపై వందలసార్లు చూసినట్టే అనిపిస్తుంటుంది.
తొలి సగంలో చాలా సన్నివేశాలు కీలక మలుపు తీసుకుంటుందన్న భ్రమకి గురి చేస్తుంటాయి. కానీ చెప్పుకోదగ్గ మలుపులేమీ ఉండవు. కథ ముందుకు కదిలే కొద్దీ గడిచిన సన్నివేశాలన్నీ ఓ ఆసక్తిని రేకెత్తించడానికే తీశారనీ.. ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టే వ్యూహమే అని అర్థమవుతుంటుంది.
మలిసగంలో అసలు కథ ఉండటం.. అందులోనే ప్రేక్షకుడి హృదయాన్ని తాకే ఫీల్ ఉండటం కాస్తలో కాస్త వూరట. మెరుపు వేగంతో సాగే సినిమాలకి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం మింగుడుపడటం కష్టమే. కాకపోతే చివరివరకు ఓపిక పడితే మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటికి రావొచ్చు. పతాక సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
ఎవరెలా చేశారంటే?: దుల్కర్.. నిత్యమేనన్‌లు వారి వారి నటనతో కథకి ప్రాణం పోశారు. సన్నివేశాల్లో చెప్పుకోదగ్గ బలం లేకున్నా సరే ఈ జంట తమదైన మేజిక్‌తో రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. శేఖర్ మేనన్ గుమ్మడి పాత్రలో సున్నితమైన వినోదాన్ని పంచుతారు. ఇక మిగిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పుకొనేది ఉండదు. వినీత్ ఈ సినిమాలో కథానాయిక నిత్యకి తండ్రిగా కనిపిస్తాడు.
సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. దర్శకుడి పనితనం ఆకట్టుకుంటుంది. కొత్త కథ కాకున్నా.. ఆ కథలో పెద్దగా మలుపులు ఏమీ లేకున్నా ప్రేక్షకుడిని ఆసక్తికి గురిచేసేలా తెరపైకి తీసుకొచ్చారు. ప్రతీష్ వర్మ కెమెరా కథలోని మూడ్‌ని చక్కగా తెరపై ఆవిష్కరించింది. గోవింద్ మేనన్ బాణీలు బాగున్నాయి.
+ దుల్కర్.. నిత్యమేనన్‌ల నటన
+ పతాక సన్నివేశాలు
- పాత కథ
- నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరిగా.. సాగతీతతో సాగే సున్నితమైన ప్రేమకథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







