సూడాన్ సైన్యానికి ఆయుధాల సరఫరా కేసు.. 8 మందికి జీవిత ఖైదు

- October 29, 2026 , by Maagulf
సూడాన్ సైన్యానికి ఆయుధాల సరఫరా కేసు.. 8 మందికి జీవిత ఖైదు

ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులో అబుదాబీ కోర్టు కీలక తీర్పు.. ఆరు కంపెనీలకు భారీ జరిమానాలు

అబుదాబి: సూడాన్ సైన్యానికి అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలు సరఫరా చేయడంతో పాటు, ఈ లావాదేవీలకు సంబంధించిన నిధులను మనీలాండరింగ్ చేసిన కేసులో అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది. మరికొందరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించింది.

ఆయుధాల కొనుగోలు, విక్రయాలు, వాణిజ్య సంస్థలు, బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపుల ద్వారా సూడాన్ సైన్యానికి సైనిక సామగ్రిని సరఫరా చేసిన నెట్‌వర్క్‌ను దర్యాప్తులో గుర్తించారు. లావాదేవీల అసలు స్వరూపం, నిధుల మూలాలు, వాటి గమ్యస్థానాలను దాచిపెట్టేందుకు నిందితులు ప్రయత్నించినట్లు కోర్టు నిర్ధారించింది.

ఎనిమిది మందికి జీవిత ఖైదు

జీవిత ఖైదు పడిన వారిలో రషీద్ ఒమర్ అబ్దుల్ ఖాదిర్ అలీ, సలాహ్ అబ్దుల్లా మొహమ్మద్ మొహమ్మద్ సలేహ్ అలియాస్ సలాహ్ గోష్, అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబ్దుల్లా ఖలఫల్లా, అహ్మద్ రబీ సయ్యద్ అహ్మద్, మొహమ్మద్ ఫత్ అల్ బీక్, యాసర్ అబ్దుర్రహ్మాన్ అల్ అట్టా, ఉస్మాన్ అల్ జుబైర్, మహేర్ అబ్దుల్ జలీల్ ఉన్నారు.

వీరు శిక్షలు పూర్తిచేసుకున్న అనంతరం యూఏఈ నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నేరాలకు ఉపయోగించినట్లు గుర్తించిన మందుగుండు సామగ్రి, మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.

మరోవైపు, రషీద్ ఒమర్, సలాహ్ గోష్, అహ్మద్ అబ్దుల్లా, మహేర్ అబ్దుల్ జలీల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్, ఉస్మాన్ బాబికర్, ఖాలిద్ యూసుఫ్ ముఖ్తార్, అహ్మద్ ఖలఫల్లా అబ్దుల్లాలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్ నేరానికి సంబంధించి జరిమానా విధించిన వారికి ఒక్కొక్కరికి దిర్హామ్‌ 10 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించింది.

స్వాధీనం చేసుకున్న నిధుల్లో దిర్హామ్‌ 15.45 లక్షలను జప్తు చేయాలని, శిక్షలు పూర్తయ్యాక దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

ఆరు కంపెనీలకు జరిమానా.. లైసెన్సుల రద్దు

ఈ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు ఆరు కంపెనీలకు ఒక్కొక్కదానికి దిర్హామ్‌ 10 లక్షల చొప్పున జరిమానా విధించారు.

జరిమానా ఎదుర్కొన్న కంపెనీల్లో రషీద్ ఒమర్ బ్రోకరేజ్ కంపెనీ, పోర్టెక్స్ ట్రేడ్ లిమిటెడ్, అపోలారా ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ కంపెనీ, ఎల్లో సాండ్ ట్రేడింగ్ కంపెనీ, వార్దత్ అల్ మసర్రా ట్రేడింగ్ కంపెనీ, సుడామినా – ఫ్రీ జోన్ ఉన్నాయి.

ఈ కంపెనీల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. వాటికి సంబంధించిన నిలిపివేసిన నిధులు, మనీలాండరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని స్పష్టం చేసింది.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ముబారక్ అలీ అల్ షేక్, ముసాబ్ అవద్ అల్ కరీమ్ హసన్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

పోర్ట్ సూడాన్‌కు ఆయుధాల సరఫరా

కోర్టు తీర్పు ప్రకారం, నిందితులు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన లైసెన్సులు, అనుమతులు పొందకుండానే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాల వ్యాపారానికి పాల్పడ్డారు.

గోర్యూనోవ్ (Goryunov) రకం మందుగుండు సామగ్రిని యూఏఈలోకి తీసుకొచ్చి, అక్కడి నుంచి విమానంలో పోర్ట్ సూడాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, విమానంలో తరలించే సరుకును వైద్య పరికరాలు, వైద్య సామగ్రిగా పేర్కొంటూ అసలు విషయాన్ని దాచిపెట్టినట్లు కోర్టు గుర్తించింది.

ఈ ఆయుధ ఒప్పందాలకు సంబంధించిన చెల్లింపులను యూఏఈలోనే బ్యాంకు బదిలీలతో పాటు నగదు రూపంలో నిర్వహించారు.

ఆయుధ ఒప్పందాల్లో కీలక వ్యక్తుల పాత్ర

తీర్పులో రషీద్ ఒమర్ అబ్దుల్ ఖాదిర్ అలీ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు కోర్టు పేర్కొంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాల సరఫరా ఒప్పందాలను ఖరారు చేయడం, వాటి అమలును పర్యవేక్షించడం, సంబంధిత వ్యక్తుల మధ్య సమన్వయం చేయడం వంటి బాధ్యతలను అతను నిర్వహించినట్లు తెలిపింది.

తన కంపెనీ ద్వారా సూడాన్ సైన్యానికి సైనిక సామగ్రి సరఫరా ఏర్పాట్లు చేసిన రషీద్ ఒమర్.. ఒప్పందాల చెల్లింపులకు సంబంధించిన నిధులను యూఏఈలో స్వీకరించినట్లు కోర్టు నిర్ధారించింది. ఒక ఆయుధ ఒప్పందంలో భాగంగా మహేర్ అబ్దుల్ జలీల్ నుంచి సుమారు దిర్హామ్‌ 80 లక్షలను నగదు రూపంలో అందుకున్నట్లు తీర్పులో పేర్కొంది.

సూడాన్ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్‌కు సహాయకుడిగా, ఆయుధాల సమీకరణ బాధ్యతలు నిర్వహిస్తున్న యాసర్ అల్ అట్టా ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు అభ్యర్థించినట్లు కోర్టు తెలిపింది. పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో విమానం దిగేందుకు అనుమతి పొందే ప్రయత్నాలు కూడా చేసినట్లు పేర్కొంది.

అలాగే, సూడాన్ సైన్యంలో ఆర్థిక వ్యవహారాలు, ఆయుధాల అవసరాలు, సరుకుల తనిఖీలు, సరఫరాదారులకు చెల్లింపులను పర్యవేక్షించే ఉస్మాన్ అల్ జుబైర్.. ఆయుధ ఒప్పందాలకు సంబంధించిన మొత్తాలను చెల్లించినట్లు కోర్టు నిర్ధారించింది. అవసరమైన అనుమతులు లేవని తెలిసినప్పటికీ, హవాలా దార్ వ్యవస్థ ద్వారా మహేర్ అబ్దుల్ జలీల్‌కు నిధులు అందించినట్లు తీర్పులో పేర్కొంది.

మహేర్ అబ్దుల్ జలీల్ ఈ ఒప్పందాల్లో మధ్యవర్తిగా, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలక వ్యక్తిగా వ్యవహరించినట్లు కోర్టు తెలిపింది. బ్యాంకు ఖాతాలు, తనకు సంబంధించిన కంపెనీల ద్వారా నిధుల బదిలీలను నిర్వహించినట్లు పేర్కొంది.

సలాహ్ గోష్‌కు కేటాయించిన కమీషన్‌ను ఖాలిద్ యూసుఫ్ ముఖ్తార్ స్వీకరించినట్లు, ఆయుధాల సరఫరా ఒప్పందాలకు అవసరమైన అనుమతులు పొందేందుకు అహ్మద్ రబీ సయ్యద్ అహ్మద్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కోర్టు వెల్లడించింది.

సూడాన్ మాజీ ఆర్థిక మంత్రి సలహాదారుగా పనిచేసిన మొహమ్మద్ ఫత్ అల్ బీక్.. రషీద్ ఒమర్‌ను ఇతర కీలక వ్యక్తులకు పరిచయం చేయడంతో పాటు, సూడాన్ సైన్యానికి సరఫరాదారుగా అతని కంపెనీకి ఆమోదం లభించేందుకు సహకరించినట్లు తీర్పులో పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా మొదటి ఒప్పందంలో దిర్హామ్‌ 1.46 లక్షలు అందుకున్నట్లు తెలిపింది.

అదేవిధంగా, అహ్మద్ ఖలఫల్లా మొదటి ఒప్పందం ద్వారా దిర్హామ్‌ 18.5 లక్షలు అందుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఆయుధాల వ్యాపారానికి అవసరమైన అనుమతులు తనకు, తన సోదరుడికి లేదా సంబంధిత కంపెనీకి లేవని తెలిసినప్పటికీ ఈ లావాదేవీలు జరిగినట్లు తీర్పులో పేర్కొంది.

యూఏఈ ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలు

ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ వ్యవహారాలు ఒక సమన్వయంతో కూడిన నేర కార్యకలాపాలుగా సాగినట్లు కోర్టు నిర్ధారించింది. నిధుల అసలు మూలాలు, గమ్యస్థానాలను దాచేందుకు నకిలీ పత్రాలు, కంపెనీలు, బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు తెలిపింది.

సూడాన్‌లో కొనసాగుతున్న సాయుధ సంఘర్షణ నేపథ్యంలో, ఆ ఘర్షణలో పాల్గొంటున్న ఒక పక్షానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ ఆయుధ ఒప్పందాలు జరిగినట్లు కోర్టు పేర్కొంది.

యూఏఈ భూభాగాన్ని, ఆర్థిక వ్యవస్థను ఇటువంటి కార్యకలాపాలకు ఉపయోగించడం అంతర్జాతీయ సమాజంతో దేశానికి ఉన్న సంబంధాలకు హాని కలిగించడంతో పాటు, దేశ ప్రయోజనాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఆయుధాల సరఫరాపై వర్తించే అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఆయుధాల ఒప్పందాలు, ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం వంటి చర్యలను ఒకే నేర కార్యకలాపాల సమూహంలో భాగంగా పరిగణించిన కోర్టు.. మనీలాండరింగ్‌ను ప్రత్యేక నేరంగా పరిగణించింది.

దర్యాప్తు అనంతరం విచారణకు నిందితులు

ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన అనంతరం నిందితులను విచారణకు పంపాలని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ఆదేశించారు.

దర్యాప్తులో సేకరించిన సాంకేతిక, ఆర్థిక ఆధారాలు.. యూఏఈలోని కంపెనీలు, బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆయుధాల అక్రమ రవాణా, వాటికి సంబంధించిన నిధుల మనీలాండరింగ్‌కు పాల్పడిన వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను బయటపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో వెలువడిన తీర్పు అక్రమ ఆయుధాల వ్యాపారం, ఆర్థిక నేరాలపై యూఏఈ అధికారుల కఠిన వైఖరిని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com