ఒమన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్లకు కొత్త నిబంధనలు..!!

- October 29, 2026 , by Maagulf
ఒమన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్లకు కొత్త నిబంధనలు..!!

మస్కట్‌: ఒమన్‌లో డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించే వ్యాపారులు ఉత్పత్తుల అసలు ధర, తగ్గింపు ధరతో పాటు డిస్కౌంట్‌ శాతాన్ని కూడా స్పష్టంగా ప్రదర్శించాలని వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే OMR500 జరిమానా విధిస్తామని, పునరావృతమైతే జరిమానా రెట్టింపు అవుతుందని హెచ్చరించింది.

డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించడానికి ముందుగా వ్యాపారులు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆ లైసెన్స్‌ను దుకాణంలో కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని, వినియోగదారులు ధరలను సులభంగా పోల్చుకునేలా అసలు ధర, తగ్గింపు ధర, తగ్గింపు శాతాన్ని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.

నిబంధనల ప్రకారం సాధారణంగా డిస్కౌంట్‌ కనీసం 20 శాతం ఉండాలి. అయితే ఆహార ఉత్పత్తులు, వాహనాలు, బంగారం, విలువైన రాళ్లు, ఆభరణాలు తదితర వస్తువులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. లైసెన్స్‌లో పేర్కొన్న గడువులోనే డిస్కౌంట్‌ ఆఫర్లను అమలు చేయాలి. వాటికి సంబంధించిన నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.

డిస్కౌంట్‌ ప్రకటించే ముందు ఉత్పత్తుల ధరలను పెంచడం, వాస్తవానికి లేని ఆదాను చూపిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఆఫర్లు ఇవ్వడం నిషేధం. ఇప్పటికే అనుమతి పొందిన డిస్కౌంట్‌ శాతం లేదా గడువులో మార్పులు చేయాలంటే మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. డిస్కౌంట్‌ ముగిసిన తర్వాత కూడా కనీసం 30 రోజుల పాటు ఉత్పత్తులు వినియోగానికి అనుకూలంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు, వాటి ఉప ఉత్పత్తులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డిస్కౌంట్లు ఇవ్వడాన్ని కూడా నిబంధనలు నిషేధిస్తున్నాయని పేర్కొంది.

ముఖ్యంగా సీజనల్‌ సేల్స్‌, క్లియరెన్స్‌ సేల్స్‌ సమయంలో వినియోగదారులకు ధరల విషయంలో స్పష్టత కల్పించడం, తప్పుడు ప్రకటనలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com