కువైట్‌తో పెట్టుబడుల అవకాశాలపై భారత్ ఫోకస్..!!
- November 01, 2026
కువైట్ : భారత్, కువైట్ దేశాల మధ్య పెట్టుబడుల సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని కువైట్‌లో భారత రాయబారి పరమిత త్రిపాఠి వెల్లడించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడులకు ఇరు దేశాలు అవకాశాలను అన్వేషిస్తున్నాయని తెలిపారు. ఇటీవల కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రీఫాయ్తో జరిగిన సమావేశం చాలా సానుకూలంగా సాగిందని ఆమె పేర్కొన్నారు. ఇరు దేశాలకు పెట్టుబడుల రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పారు. ద్వైపాక్షిక పెట్టుబడుల జాయింట్ వర్కింగ్ గ్రూప్ ద్వారా ఈ దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని వివరించారు. పెట్టుబడులపై చర్చలు 10 లేదా 15 నిమిషాల్లో పూర్తయ్యే అంశం కాదని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని, మంచి పురోగతి సాధిస్తున్నామని రాయబారి తెలిపారు. వివిధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్టుల (జాయింట్ వెంచర్స్) అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌లో మౌలిక సదుపాయాల రంగం పెట్టుబడులకు మంచి అవకాశాలు కల్పిస్తోందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై కూడా కువైట్‌కు ఆసక్తి ఉందని చెప్పారు.
భారత్‌లో 7.8 శాతం జీడీపీ వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రస్తావించిన రాయబారి.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. క్వాంటం కమ్యూనికేషన్, స్వదేశీ ఏఐ చిప్‌ల అభివృద్ధి వంటి కీలక సాంకేతిక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు. భారత్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 65 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రానున్న నెలల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. రంజాన్ ప్రారంభానికి ముందుగా ఫొటో ఎగ్జిబిషన్, సంగీత కార్యక్రమం, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ వార్షికోత్సవం కోసం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి పర్యటనలు ఖరారు కాలేదని, భవిష్యత్ పర్యటనలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కువైట్‌లో 10.69 లక్షలకు చేరిన భారతీయులు
కువైట్‌లో అతిపెద్ద ప్రవాసీ సమాజంగా ఉన్న భారతీయుల సంఖ్య మరింత పెరిగిందని పరమిత త్రిపాఠి తెలిపారు. PACI గణాంకాల ప్రకారం 2025లో 1,059,179గా ఉన్న భారతీయుల సంఖ్య 2026లో సుమారు 1.069 మిలియన్లకు చేరిందని వెల్లడించారు. కువైట్‌లో భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. నర్సింగ్, సాంకేతిక సేవలు వంటి కీలక రంగాల్లో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అయితే భారత రాయబార కార్యాలయానికి భారతీయుల సంఖ్య పెరగడం కంటే వారి భద్రత, సంక్షేమమే ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
నవంబర్ 2, 3 తేదీల్లో దీపావళి దివానియా
భారత్, కువైట్ల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో భారత రాయబార కార్యాలయం ఇండియా హౌస్‌లో 'దీపావళి దివానియా' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గత ఏడాది ఇరు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలు యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న నేపథ్యంలో రెండు దేశాల సంస్కృతులను ఒకే వేదికపై వేడుకగా జరపాలని నిర్ణయించినట్లు రాయబారి తెలిపారు. భారతీయుల దీపాల పండుగ దీపావళితో పాటు కువైట్ సంప్రదాయమైన దివానియా ఆతిథ్యాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 2న పురుషులు, మహిళలు ఇద్దరికీ ప్రవేశం ఉండగా, నవంబర్ 3న మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాయబారి పరమిత త్రిపాఠి వెల్లడించారు.
తాజా వార్తలు
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!
- జెట్ స్కీ ప్రమాదం.. పౌరుడిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- బహ్రెయిన్‌లో 450 అక్రమ ఈ-బైక్‌లు, స్కూటర్లు స్వాధీనం..!!
- ఖతార్‌లోని జెరియన్ నజీమాలో నీటి సరఫరా నిలిపివేత..!!
- కువైట్‌తో పెట్టుబడుల అవకాశాలపై భారత్ ఫోకస్..!!
- జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం
- ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. భారత్‌కు యూఏఈ సంఘీభావం







