కలిసిపోరాడితే ప్రత్యేక హోదా తప్పక వస్తుంది.!
- August 27, 2016
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని, అందులో భాజపా పాత్ర కూడా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. తిరుపతి ఇందిరామైదానం వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా డిమాండ్ కేంద్రానికి వినిపించేలా గళమెత్తాలని జనసేన నిర్ణయించిందన్నారు. ఇందుకోసం మూడు దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మొదటిదశ: ప్రత్యేక హోదా కోసం మొదటిదశలో ప్రతీ మండలానికి వెళ్లి మనకు జరిగిన అన్యాయం ఏమిటి?
ప్రత్యేకహోదా కోసం జనసేన ఏం చేయబోతోందో వివరిస్తాం. ఎక్కడైతే రాష్ట్రాన్ని విడకొట్టాలని నిర్ణయించారో ఆ కాకినాడలోనే సెప్టెంబరు 9న తొలి సభ నిర్వహిస్తా.
రెండో దశ: రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార పార్టీ ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మీద భాజపా ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా కొన్నిపద్ధతులు పాటిస్తాం.
మూడోదశ: ఎంపీలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక మూడోదశను తీసుకొస్తాం. ప్రజల సహకారంతో వారి ఆలోచనలు తీసుకుని, రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడతాం.
కేంద్రం ఏం చేస్తుందో చూద్దామనే రెండేళ్లు వేచి చూశానని పవన్ తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏపీ యువత ఎలా ముందుకు వెళ్తుందని, రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు.
యువతే దేశ సంపద: పవన్‌కల్యాణ్
విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ అన్నారు. శనివారం తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఏదైనా మాట్లాడేటప్పుడు తాను ఆచితూచి మాట్లాడతానని అన్నారు. ఒక దేశపు సంపద అంటే ఖనిజాలు కావని, యువతే దేశ సంపద అని పునరుద్ఘాటించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, సమాజం, దేశంపై వ్యామోహం ఉందని అన్నారు. తాను రూ.కోట్లు సంపాదిస్తానని, కోట్ల పన్ను కడతానన్న పవన్.. తనకు సమాజం మీద బాధ ఉందన్నారు. వర్తమాన రాజకీయాలు, నేతలు యువతకు మేలు చేయకపోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
మూడు అంశాలపై మాట్లాడతా
'జనసేన పార్టీ పెట్టి 2సంవత్సరాల 9 నెలలు కావస్తోంది. ప్రస్తుతం మూడు అంశాలపై సభలో మాట్లాడతా. జనసేన ప్రస్థానంపై మాట్లాడాలి. ఈ రెండేళ్ల తెదేపా, భాజపా పాలనపైనా మాట్లాడాలి. అడగాల్సినవి ఉన్నాయి. తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. సినిమాల్లో అన్యాయాలను ఎదుర్కోవచ్చు, సమస్యలకు పరిష్కారాలు చూపొచ్చు. సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా రెండు గంటల్లో పరిష్కరించవచ్చు. కానీ నిజజీవితంలో సమస్యల పరిష్కారం అంత సులువు కాదు. నేను ఏ తెదేపా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానో ఆ ప్రభుత్వం తీరు గమనిస్తున్నా. పవన్ జనసేన.. మోదీ భజనసేన అని కొందరు అన్నారు. గబ్బర్‌సింగ్ కాదు రబ్బర్‌సింగ్ అన్నారు. భజనసేన అనేది కరెక్టే.. ప్రజా సమస్యలపై నేను భజనసేననే..' అని పవన్‌కల్యాణ్ అన్నారు.
ఏ కథానాయకుడితోనూ విభేదాల్లేవు
సినీ రంగంలో తనకు ఏ కథానాయకుడితోనూ విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను సినీ జీవితం కన్నా, నిజ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుంటానని తెలిపారు. సినిమాను కేవలం వినోదంగానే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. జనసేనాని వినోద్ రాయల్ హత్య తనకు చాలా బాధ కలిగించిందన్నారు. క్షణికావేశం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చిందన్నారు. బిడ్డ హత్యకు గురైనా ఆ తల్లి తన బిడ్డ కళ్లను దానం చేసిందని పేర్కొన్నారు. వినోద్‌రాయల్ తల్లికి తాను పాదాభివందనం చేస్తున్నానన్నారు.
రిస్క్‌లు ఎదుర్కొనే రాజకీయాల్లోకి వచ్చా!
అన్ని రిస్క్‌లు ఎదుర్కొనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. 'మోదీని పార్లమెంట్లో తొలిరోజు కలిశా.. మళ్లీ ఇంతవరకు కలవలేదు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశా. భాజపాలో చేరమని నన్ను అడిగారు. జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ కన్నా ఎక్కువ అని చెప్పా. జాతీయ సమగ్రత, సామరస్యత కోరే పార్టీ జనసేన అని చెప్పా. అమరావతి విషయంలో కొందరు నాపై కుల ముద్రవేశారు. మనది ఒకటే కులం, ఒకటే మతం.. మానవతా కులం.. మానవతా మతం.. నా కుమార్తె క్రిస్టియన్, నా కుమార్తె తల్లి రష్యన్ ఆర్ధడాక్స్ చర్చికి చెందినవారు. నాకు కులం, మతం అంటగడితే అరికాలి నుంచి మంటెక్కుతుంది. నేను ఏం చేసినా అబద్ధాలు చెప్పను. మిమ్మల్ని మభ్యపెట్టను' అని పవన్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందని అయితే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత తనకు లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని, అక్కడేమీ బ్రహ్మరాక్షసులు లేరని అక్కడ ఉంది కూడా మనలాంటి మనుషులే కదా అని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీలు మేడమ్.. మేడమ్.. అని బతిమలాడేవారని, ఇప్పుడు ఎంపీలు సార్.. సార్.. అని బతిమలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు సూచించారు. రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అని తన పోరాటంలో తాను గెలవొచ్చు. ఓడిపోవచ్చు.. వెనకడుగు వేయనని పవన్ స్పష్టం చేశారు.గోసంరక్షణ చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్త ఒక ఆవును పెంచుకోమనండని పవన్ సూచించారు. గోమాత పేరుతో సమస్యలను గాలికి వదిలేయవద్దని అన్నారు. తెదేపా ప్రభుత్వం, విపక్షాలు ఒకటే మాటగా ఉండాలన్న పవన్.. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా ఉండకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







