బహ్రెయిన్‌లో 450 అక్రమ ఈ-బైక్‌లు, స్కూటర్లు స్వాధీనం..!!
- November 01, 2026
మనామా: రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా బహ్రెయిన్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ఈ-బైక్‌లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 450 ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్లను అధికారులు సీజ్ చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (హోం మినిస్ట్రీ) వెల్లడించింది. రోడ్లపై ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను ప్రమాదకరంగా వినియోగించడం వల్ల ఇతర వాహనదారులతో పాటు చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తనిఖీలు, ప్రత్యేక నిఘా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గంటకు 25 కిలోమీటర్లకు మించరాదు
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్లను ప్రధాన రహదారులపై వినియోగించడానికి అనుమతి లేదని అధికారులు గుర్తుచేశారు. వీటి గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లకు మించకూడదని స్పష్టం చేశారు. ఏడేళ్లలోపు పిల్లలు ఎలక్ట్రిక్ స్కూటర్లు నడపడం నిషేధమని తెలిపారు. పిల్లలు ఈ వాహనాలను వినియోగించే సమయంలో తల్లిదండ్రులు లేదా బాధ్యత కలిగిన పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు.
BD 50 నుంచి BD 100 వరకు జరిమానా
నిబంధనలను ఉల్లంఘించిన వారికి BD 50 నుంచి BD 100 వరకు జరిమానా విధిస్తారు. కోర్టు తీర్పు వెలువడిన ఏడాది లోపు అదే తప్పిదాన్ని మళ్లీ చేస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సంబంధిత వాహనాన్ని 60 రోజుల పాటు స్వాధీనంలో ఉంచుతారు. అనుమతించిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ వాహనాలను వినియోగించేందుకు అనుమతించిన తల్లిదండ్రులపై కూడా ప్రత్యేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష, BD 100 నుంచి BD 500 వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షల్లో ఏదో ఒకటి విధించే అవకాశం ఉంది.
పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు సూచన
పిల్లలు ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను వినియోగించే తీరుపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రమాదకరంగా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను పిల్లలకు వివరించాలని కోరారు. ప్రజల సహకారం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ద్వారానే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించి రహదారి భద్రతను కాపాడగలమని బహ్రెయిన్ హోం మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!
- జెట్ స్కీ ప్రమాదం.. పౌరుడిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- బహ్రెయిన్‌లో 450 అక్రమ ఈ-బైక్‌లు, స్కూటర్లు స్వాధీనం..!!
- ఖతార్‌లోని జెరియన్ నజీమాలో నీటి సరఫరా నిలిపివేత..!!
- కువైట్‌తో పెట్టుబడుల అవకాశాలపై భారత్ ఫోకస్..!!
- జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహమాడిన జమ్మూ కాశ్మీర్ సీఎం
- ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. భారత్‌కు యూఏఈ సంఘీభావం







