ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు

- November 02, 2026 , by Maagulf
ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు

స్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ దిగుమతుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, విదేశాలకు అక్రమంగా వేల కోట్ల రూపాయల నిధులను తరలిస్తున్న భారీ మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఛేదించారు.

విశాఖపట్నం సబ్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీ, కోల్‌కతాల్లోని 7 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1,500 కోట్ల మేర నేరపూరిత లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.

షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధుల తరలింపు

ఈ అక్రమ లావాదేవీల వెనుక వడ్డీ మహేశ్, ఆయన తండ్రితో పాటు మరికొందరు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వీరంతా కలిసి కోల్‌కతా కేంద్రంగా పలు నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2017 మధ్య కాలంలో ఫోర్జరీ ఇన్వాయిస్‌లు, నకిలీ పత్రాలను సృష్టించి, వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు సొమ్మును మళ్లించారు. ప్రధానంగా సింగపూర్, హాంకాంగ్, చైనాల్లోని ఐదు కంపెనీలకు రూ. 569.03 కోట్లు బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

విదేశీ కరెన్సీ, కీలక పత్రాలు సీజ్.. లెక్క చూపని రూ.47 లక్షలు

సోదాల సందర్భంగా అక్రమార్కుల వద్ద నుంచి భారీగా నగదు, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5,900 అమెరికన్ డాలర్లు, 2,200 యూఏఈ దిర్హామ్‌లు, 5,600 చైనా కరెన్సీతో పాటు డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలు, అనేక కీలక ఆధారాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ కుంభకోణంలో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com