ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!

- November 03, 2026 , by Maagulf
ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!

మస్కట్: ఒమన్‌లోని ముసందమ్ గవర్నరేట్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో నిర్వహించనున్న ‘ముసందమ్ వింటర్ 2026-2027’ సీజన్ ప్రచార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మస్కట్ గవర్నర్, రాష్ట్ర మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించారు. ‘ముసందమ్: అనుభూతి చెందాల్సిన అనుభవం’ (Musandam: An Experience to Live) అనే నినాదంతో ఈ సీజన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 75 విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముసందమ్ కార్నివాల్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఫెస్టివల్, ముసందమ్ కల్చరల్ డేస్, కుమ్జార్ ఫెస్టివల్, బుఖా లైట్స్ ఫెస్టివల్, ప్రవాసీ కమ్యూనిటీల క్రీడా పోటీలు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ఈ సందర్భంగా ముసందమ్ గవర్నర్ సయ్యద్ ఫైసల్ బిన్ హమూద్ అల్ బుసైదీ మాట్లాడుతూ.. పర్యాటకం, పెట్టుబడులు, సాంస్కృతిక రంగాల్లో ముసందమ్‌ను ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ఈ సీజన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్థానికంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (SMEs) అవకాశాలు కల్పించడం, స్థానిక ప్రజలకు ఉపాధి, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, వివిధ రంగాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం కూడా లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఇవన్నీ ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు.

ఈ ఏడాది సీజన్‌లో ముసందమ్ కార్నివాల్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఫెస్టివల్, జాతీయ దినోత్సవ వేడుకలు, ముసందమ్ కల్చరల్ డేస్, కుమ్జార్ ఫెస్టివల్, బుఖా లైట్స్ ఫెస్టివల్, ప్రవాసీ కమ్యూనిటీల క్రీడా పోటీలు, గాలిపటాల పండుగ, మోటార్ స్పోర్ట్స్, గుర్రపు స్వారీ పోటీలు, లిమా బజార్ నిర్వహించనున్నారు. పర్యాటకుల కోసం జిప్‌లైనింగ్, సముద్ర గర్భంలో డైవింగ్, పర్వత ట్రెక్కింగ్, పర్వతారోహణ, కయాకింగ్, ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్, సముద్రంలో చేపల వేట, క్యాంపింగ్, పాడెల్ క్రీడలు వంటి అనేక సాహస కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సీజన్ ద్వారా స్థానిక చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఒమానీ ఉత్పత్తులు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వ్యాపారాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముసందమ్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడి సందర్శన స్థానిక ప్రజల జీవనోపాధికి, ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com