ఖతార్‌లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!

- November 05, 2026 , by Maagulf
ఖతార్‌లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!

దోహా: ఖతార్‌లో జరగనున్న మోటోజీపీ ఖతార్ ఎయిర్‌వేస్ గ్రాండ్ ప్రిక్స్ 2026కు సంబంధించి లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) ప్రేక్షకుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ 6 నుంచి 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మొత్తం 22 రేసుల ఛాంపియన్‌షిప్‌లో ఇది 20వ రౌండ్ కాగా, లుసైల్ సర్క్యూట్‌లో మోటోజీపీ పోటీలు నిర్వహించడం ఇది 22వసారి. ఈ సందర్భంగా నవంబర్ 6, 7 తేదీల్లో సర్క్యూట్ గేట్లు ఉదయం 11:30 గంటలకు తెరిచి సాయంత్రం 7:30 గంటలకు మూసివేస్తారు. నవంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు గేట్లు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేయనున్నారు. పూర్తి ఈవెంట్ షెడ్యూల్‌ను www.lcsc.qa/motogp వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మెట్రో ద్వారా వచ్చే ప్రేక్షకులు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఖతార్ యూనివర్సిటీ మెట్రో స్టేషన్ నుంచి లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వరకు, తిరుగు ప్రయాణానికి కూడా ప్రతి 15 నిమిషాలకు ఉచిత ప్రత్యేక షటిల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక సొంత వాహనాల్లో వచ్చే వారు అల్ ఖోర్ కోస్టల్ రోడ్ మీదుగా సర్క్యూట్‌కు చేరుకోవాలి. ఎగ్జిట్ 32 వద్ద బయటకు వచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన దిశా సూచికలను అనుసరిస్తూ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఫ్యాన్ జోన్‌లో ప్రత్యేక ఆకర్షణలు

ఈసారి ఫ్యాన్ జోన్‌లో వినోదంతో పాటు ఖతార్ సంప్రదాయాలు, సంస్కృతిని పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కల్చరల్ విలేజ్‌లో సంప్రదాయ హస్తకళలు, హెన్నా, సుగంధ ద్రవ్యాలు, ఊద్ ప్రదర్శనలు, దహ్రూయ్ అనే సంప్రదాయ ఖతారీ ఆటను సందర్శకులు ఆస్వాదించవచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఫొటో దిగేందుకు ఏర్పాట్లు, వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు అందుబాటులో ఉంటాయి.

ఇక నవంబర్ 6న సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు ఆటోగ్రాఫ్ సెషన్ నిర్వహించనున్నారు. ఇందులో 200 మంది అభిమానులకు ప్రపంచంలోని ప్రముఖ రేసింగ్ రైడర్లను కలుసుకుని వారి ఆటోగ్రాఫ్‌లు పొందే అవకాశం కల్పించనున్నారు.

5.38 కిలోమీటర్ల ట్రాక్‌పై నైట్ రేస్

2004లో ప్రారంభమైన మోటోజీపీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 2026 పోటీల్లో కూడా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి కలగనుంది. ప్రపంచ మోటోజీపీ ఛాంపియన్‌షిప్‌లో ఏకైక నైట్ రేస్‌గా గుర్తింపు పొందిన ఈ పోటీలు 5.38 కిలోమీటర్ల పొడవైన లుసైల్ ట్రాక్‌పై జరగనున్నాయి. ఇందులో 16 మలుపులు ఉన్నాయి. 

ఈ వారాంతంలో మోటోజీపీ టిస్సోట్ స్ప్రింట్, మోటో2, మోటో3, ఇడెమిట్సు మోటో4 ఆసియా కప్ పోటీలతో పాటు ప్రారంభ వేడుక కూడా నిర్వహించనున్నారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్‌ను ఆస్వాదించేందుకు అవసరమైన సమాచారం కోసం LIC యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com