దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!

- November 05, 2026 , by Maagulf
దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!

దుబాయ్: అద్దె ఒప్పందం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా అద్దె చెల్లించకుండా ఎనిమిది నెలల పాటు కాలం గడిపిన ఓ వ్యాపారికి దుబాయ్‌లోని అద్దె వివాదాల పరిష్కార కేంద్రం (RDC) షాక్ ఇచ్చింది. బకాయి పడిన Dh2.415 మిలియన్ల అద్దెను చెల్లించేందుకు ప్రయత్నించినప్పటికీ, గడువు ముగిసిన తర్వాత చెల్లింపునకు ముందుకు రావడంతో ఆస్తిని ఖాళీ చేయాలని ఆదేశించింది.

దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో ఉన్న వాణిజ్య ప్రాంగణానికి సంబంధించి ఈ వివాదం తలెత్తింది. ఎనిమిది నెలల అద్దె కాలానికి మొత్తం Dh2,415,000 చెల్లించాల్సి ఉండగా, అద్దెదారు ఒప్పందం ప్రారంభం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో మొత్తం అద్దె బకాయిగా పేరుకుపోయింది.

30 రోజుల నోటీసు ఇచ్చినా చెల్లించని అద్దెదారు

అద్దె చెల్లించకపోవడంతో యజమాని చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. బకాయి మొత్తాన్ని చెల్లించాలి లేదా 30 రోజుల్లోగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కోరుతూ అధికారిక నోటీసు జారీ చేశారు. అయితే నిర్దేశిత గడువులోగా అద్దెదారు బకాయిలను చెల్లించలేదు.

విచారణ సందర్భంగా బకాయి అద్దెను చెల్లించేందుకు ఆఫర్ ఇచ్చి, ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అద్దెదారు సమర్పించారు. అయితే ఈ చెల్లింపు ప్రయత్నం చట్టబద్ధమైన 30 రోజుల గడువు ముగిసిన తర్వాత జరిగినట్లు ప్రాథమిక విచారణ కమిటీ గుర్తించింది. దీంతో గడువు దాటిన తర్వాత చేసిన చెల్లింపు ప్రయత్నం బహిష్కరణను నిలువరించలేదని స్పష్టం చేసింది.

దుబాయ్ అద్దె చట్టం ఏం చెబుతోంది?

దుబాయ్‌లో యజమానులు, అద్దెదారుల మధ్య సంబంధాలను నియంత్రించే 2007 నాటి చట్టం నంబర్ 26కు, 2008లో చేసిన చట్టం నంబర్ 33 సవరణలను కమిటీ తన తీర్పులో ప్రస్తావించింది.

ఈ నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన నోటీసు అందుకున్న 30 రోజుల్లోగా అద్దెదారు బకాయిలు చెల్లించకపోతే యజమాని ఆస్తిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత చెల్లింపునకు ప్రయత్నించడం వల్ల బహిష్కరణ ప్రక్రియ ఆగదని కమిటీ స్పష్టం చేసింది.

అదనపు అద్దె కూడా చెల్లించాల్సిందే

వాణిజ్య ప్రాంగణాన్ని ఖాళీ చేసి, అందులో ఎలాంటి వ్యక్తులు లేదా వస్తువులు లేకుండా యజమానికి అప్పగించాలని కమిటీ ఆదేశించింది. వాస్తవంగా ఆస్తిని ఖాళీ చేసే తేదీ వరకు వర్తించే వార్షిక అద్దె రేటు ప్రకారం అదనపు అద్దెతో పాటు సంబంధిత ఫీజులు, ఇతర ఖర్చులను కూడా అద్దెదారు చెల్లించాలని తీర్పునిచ్చింది.

అద్దె బకాయిల విషయంలో చట్టపరమైన నోటీసుల్లో పేర్కొన్న గడువులను తప్పనిసరిగా పాటించాలని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించకపోతే, ఆ తర్వాత చెల్లించేందుకు ప్రయత్నించినా ఆస్తి ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చని ఈ కేసు అద్దెదారులకు హెచ్చరికగా నిలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com