ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- November 07, 2026
మస్కట్: ఒమన్‌లోని మస్కట్ నుంచి ముంబైకి వెళ్లే విమాన ప్రయాణికులకు త్వరలో కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ముంబైలోని ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి (NMIA) విమాన కార్యకలాపాలను దశలవారీగా తరలించనున్నారు. 2027 రెండో త్రైమాసికం చివరి నాటికి మస్కట్‌తో సహా 14 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సంబంధించిన విమానాలన్నీ కొత్త విమానాశ్రయం నుంచి నడిచే అవకాశం ఉంది.
రాబోయే వేసవి విమాన షెడ్యూల్లో ప్రస్తుత ముంబై విమానాశ్రయంలో 12 విమానయాన సంస్థలకు స్లాట్లు కేటాయించలేదని సమాచారం. ఈ సంస్థలు రోజుకు సుమారు 16 విమాన సర్వీసులను 14 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపిన నోటిఫికేషన్లో ఈ 14 గమ్యస్థానాలకు సంబంధించిన అంతర్జాతీయ విమానాలను తాత్కాలికంగా నవీ ముంబై విమానాశ్రయానికి తరలించే ప్రణాళికను వెల్లడించింది.
ప్రస్తుత విమానాశ్రయంలోని టెర్మినల్-1 పునర్నిర్మాణం, విస్తరణ పనుల కోసం ఈ మార్పు అవసరమని MIAL తెలిపింది. ఈ పనులు 2029 వరకు కొనసాగనున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం నుంచి ఆయా అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే విమానాలన్నీ ఒకే విమానాశ్రయం నుంచి నడిస్తే ప్రయాణికులకు కనెక్టివిటీ సులభమవుతుందని సంస్థ పేర్కొంది.
14 ప్రభావిత గమ్యస్థానాలు ఇవే..
బహ్రెయిన్, దమ్మామ్, ఢాకా, దోహా, ఫుజైరా, జకార్తా, జెడ్డా, ఖాట్మండు, కువైట్ సిటీ, మదీనా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జాలకు వెళ్లే విమానాలు ఈ మార్పు పరిధిలోకి రానున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఇప్పటికే తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను నవీ ముంబై విమానాశ్రయానికి తరలించే ప్రణాళికలను ప్రకటించాయి. ఇండిగో 2027 ఫిబ్రవరి నుంచి రోజుకు 12 అంతర్జాతీయ విమాన సర్వీసులను కొత్త విమానాశ్రయానికి మార్చనుంది. ఇందులో మస్కట్, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, కువైట్, రస్ అల్ ఖైమా, ఫుజైరా, ఢాకా, జకార్తా మార్గాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ కూడా 2027 జనవరి నుంచి ఎంపిక చేసిన దేశీయ, పశ్చిమాసియా విమాన సర్వీసులను దశలవారీగా నవీ ముంబైకి తరలించనుంది. ఇందులో ఒమన్‌కు సంబంధించిన విమానాలు కూడా ఉన్నాయి.
ప్రయాణ ఖర్చులు 50 శాతానికి పైగా పెరిగే అవకాశం
నవీ ముంబై విమానాశ్రయానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా, కనెక్టివిటీ ప్రాజెక్టులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబై పశ్చిమ, ఉత్తర శివారు ప్రాంతాల్లో నివసించే వారికి కొత్త విమానాశ్రయానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం, డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి 1 నుంచి 1.5 గంటలు పడుతుండగా, కొత్త విమానాశ్రయానికి వెళ్లేందుకు 2 నుంచి 3 గంటల వరకు పట్టే అవకాశం ఉందని మస్కట్‌లోని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాక్సీలు, ప్రజా రవాణా ఖర్చులు పెరగడంతో ప్రయాణ వ్యయం 50 శాతానికి పైగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
మస్కట్ నుంచి నవీ ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి ముంబై పాత విమానాశ్రయం (BOM) నుంచి మరో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన ప్రయాణికులకు మరింత ఇబ్బంది ఎదురుకానుంది. ఈ రెండు విమానాశ్రయాల మధ్య దూరం దాదాపు 50 కిలోమీటర్లు ఉండటంతో కనెక్టింగ్ ఫ్లైట్లకు తగినంత సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది.
వాస్తవానికి అంతర్జాతీయ విమానాల పాక్షిక తరలింపును 2026 అక్టోబర్ 25 నుంచే ప్రారంభించాలని MIAL భావించింది. అయితే మార్పునకు సంబంధించిన గడువుపై విదేశీ విమానయాన సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ప్రక్రియను 2027 మార్చి వరకు వాయిదా వేసింది. ముంబై విమానాశ్రయాల మార్పు మస్కట్‌లోని భారతీయ ప్రవాసులతో పాటు ఒమన్-ముంబై మధ్య ప్రయాణించే వారికి ప్రయాణ సమయం, రవాణా ఖర్చుల పరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!
- డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్







