‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!

- November 07, 2026 , by Maagulf
‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!

దుబాయ్: టైప్-2 డయాబెటిస్ చికిత్సలో ఉపయోగించే కొత్త ఔషధం ‘ఫౌండాయో’ (Foundayo)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఔషధాన్ని డయాబెటిస్ చికిత్స కోసం అనుమతించిన ప్రపంచంలోని మూడో దేశంగా యూఏఈ నిలిచింది. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EDE) వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ (Eli Lilly) సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పెద్దలకు ఉపయోగించేందుకు అనుమతించారు. గత ఏప్రిల్‌లోనే బరువు నియంత్రణ చికిత్స కోసం ఈ మందుకు యూఏఈ ఆమోదం తెలిపింది.

ఫౌండాయోను రోజుకు ఒకసారి మాత్ర రూపంలో తీసుకోవచ్చు. ఇది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ మెడిసిన్ క్లాస్ కు చెందినది. ఇదే క్లాస్ కొన్ని మందులను ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సి ఉండగా, ఫౌండాయోను నేరుగా టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు. ఆహారం లేదా నీటికి సంబంధించి ప్రత్యేక పరిమితులు లేకుండా వినియోగించుకునేలా దీనిని రూపొందించారు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంతో పాటు, దీర్ఘకాలికంగా బరువును అదుపులో ఉంచేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అయితే వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని తీసుకోవాలని, తగిన ఆహార నియమాలు, క్రమం తప్పని శారీరక వ్యాయామంతో కలిపి వినియోగించాలని సూచించారు.

శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. సరైన నియంత్రణ లేకపోతే గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ప్రమాద కారకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని EDE సూచించింది. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం, వైద్యుల సూచనల ప్రకారం చికిత్స కొనసాగించడం ద్వారా సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఆధునిక ఔషధం వైద్య ప్రజలకు మరింత అందుబాటు కల్పించడంలో భాగంగానే ఫౌండాయోకు ఆమోదం తెలిపినట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com