డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- November 07, 2026
కువైట్ : ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలకు రక్షణ కల్పించడంతో పాటు, నకిలీ జీతాల చెల్లింపులను అరికట్టేందుకు కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి బ్యాంకులు జీతాల ఖాతాలపై మరింత కఠినమైన పర్యవేక్షణ చర్యలు అమలు చేయాలని ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం నెలకు KD 300 లేదా అంతకంటే తక్కువ జీతం పొందే ఉద్యోగుల ఖాతాల నుంచి KD 25 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ, నగదు బదిలీ, చెల్లింపులు జరిపేటప్పుడు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) తప్పనిసరిగా అమలు చేయాలి.
అలాగే అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకులు ప్రత్యేక నిఘా పెట్టాలి. ఒక ఉద్యోగి తన జీతంలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని 72 గంటల్లో పదేపదే విత్‌డ్రా చేసినా, బదిలీ చేసినా బ్యాంకులు పరిశీలించాలి. అదేవిధంగా జీతంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని యజమానులకు లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు బదిలీ చేసినా అనుమానాస్పద లావాదేవీగా పరిగణించాలి. ఇలాంటి లావాదేవీలు గుర్తించినప్పుడు సంబంధిత ఉద్యోగి గత ఆరు నెలల బ్యాంకు లావాదేవీలను పరిశీలించి, అవసరమైన వివరాలను సెంట్రల్ బ్యాంకుకు నివేదించాలి.
అయితే కేవలం అనుమానం ఆధారంగా ఉద్యోగులు తమ జీతాలను విత్‌డ్రా చేసుకోవడం లేదా వినియోగించుకోవడంపై బ్యాంకులు ఆంక్షలు విధించకూడదని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే ఒక ఉద్యోగి తన పూర్తి జీతాన్ని నగదు రూపంలో తీసుకున్నంత మాత్రాన దానిని నకిలీ జీతాల చెల్లింపులకు ఆధారంగా పరిగణించరాదని తెలిపింది.
కొత్త నిబంధనల అమలుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లను బ్యాంకులు గడువులోగా పూర్తి చేయాలి. అంతేకాకుండా ప్రతి నెలకు సంబంధించిన పర్యవేక్షణ నివేదికలను తదుపరి నెలలో ఐదో పని దినం నాటికి సెంట్రల్ బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ చర్యల ద్వారా ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో పారదర్శకత పెంచడంతో పాటు, నకిలీ వేతనాల చెల్లింపులు, అక్రమ లావాదేవీలను నియంత్రించాలని కువైట్ సెంట్రల్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!
- డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్







