ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!

- November 07, 2026 , by Maagulf
ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!

దోహా: ఫార్ములా-1 ఖతార్ గ్రాండ్ ప్రి 2025 పోటీలకు లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక రేసింగ్ ఈవెంట్‌కు సంబంధించిన కీలక విజువల్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఖతార్ జాతీయ రంగులతో రూపొందించిన ఫార్ములా-1 కారును ఈ పోస్టర్‌లో ప్రధానంగా చూపించారు. 

లుసైల్ సర్క్యూట్‌లోని ప్రత్యేకమైన భవనం ముందు నుంచి దూసుకెళ్తున్న రేసింగ్ ఉత్కంఠను ప్రతిబింబిస్తోంది. ఖతార్ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే సాదూ (Saadu) డిజైన్లను ట్రాక్ అంచుల్లో పొందుపరిచారు. వెనుకవైపు దోహా నగర స్కైలైన్‌ను చూపిస్తూ ఆధునికత, సంప్రదాయాల కలయికగా ఈ పోస్టర్ ను రూపొందించారు.

ఈసారి కూడా “Where Hearts Are Racing” (మనసుల వేగం పెరిగే చోటు) అనే నినాదంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 2024లో ప్రారంభించిన ఈ నినాదం ద్వారా ఖతార్ లో మోటార్‌స్పోర్ట్స్‌కు పెరుగుతున్న ఆదరణను, ట్రాక్‌పై డ్రైవర్ల ఉత్సాహాన్ని ప్రేక్షకుల అనుభూతులతో అనుసంధానించే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

ఫార్ములా-1 ప్రధాన రేసుతో పాటు స్ప్రింట్ రేస్, ఫార్ములా-2 పోటీలు కూడా ఈ వారాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ బ్రిటిష్ గాయకుడు సీల్ (Seal) నవంబర్ 28న రాత్రి ప్రధాన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. మరిన్ని వినోద కార్యక్రమాలను త్వరలో ప్రకటించనున్నారు.

టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మెయిన్ గ్రాండ్‌స్టాండ్, మూడు రోజుల జనరల్ అడ్మిషన్ టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి. అయితే నార్త్ గ్రాండ్‌స్టాండ్, T2, T3, T16 గ్రాండ్‌స్టాండ్లతో పాటు లుసైల్ హిల్ సింగిల్ డే జనరల్ అడ్మిషన్ టికెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి.

సింగిల్ డే జనరల్ అడ్మిషన్ టికెట్ ధరలు QAR 200 నుంచి ప్రారంభమవుతుండగా, మూడు రోజుల గ్రాండ్‌స్టాండ్ టికెట్ల ధరలు QAR 1,000 నుంచి మొదలవుతున్నాయి. వీటితో పాటు ప్రత్యేక హాస్పిటాలిటీ, VIP ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఫార్ములా-1 అభిమానులకు ఈ ఏడాది ఖతార్ గ్రాండ్ ప్రి మరో ఉత్కంఠభరితమైన రేసింగ్ అనుభూతిని అందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com