సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- November 14, 2026
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసుల రద్దు గడువును పొడిగించాయి. ఇప్పటికే ఇండిగో, ఆకాసా ఎయిర్ విమానాల రద్దును పొడిగించగా, తాజాగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి.
సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారుల నుంచి జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో గత కొన్ని వారాలుగా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నవంబర్ 30 వరకు నిలిపివేయనున్నారు. జెడ్డాకు సంబంధించిన విమాన సర్వీసులు నవంబర్ 21 వరకు రద్దు చేశారు.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా టికెట్ల రీషెడ్యూలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎయిర్ ఇండియా ప్రయాణికులు సౌదీ అరేబియాలోని అందుబాటులో ఉన్న ఎయిర్ ఇండియా స్టేషన్లకు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆ సంస్థకు చెందిన అందుబాటులో ఉన్న సౌదీ అరేబియా లేదా బహ్రెయిన్ స్టేషన్లకు తమ ప్రయాణాన్ని మార్చుకోవచ్చని తెలిపింది.
నవంబర్ 10 లేదా అంతకంటే ముందు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. రియాద్, దమ్మామ్ ప్రయాణాలకు నవంబర్ 30 వరకు, జెడ్డా ప్రయాణాలకు నవంబర్ 21 వరకు టికెట్లు కలిగి ఉన్నవారు సీట్ల లభ్యతను బట్టి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు. లేదా టికెట్ రద్దు చేసుకుని పూర్తి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
రీషెడ్యూల్ చేసుకున్న రియాద్, దమ్మామ్ ప్రయాణాలను డిసెంబర్ 14, 2026 వరకు, జెడ్డా ప్రయాణాలను డిసెంబర్ 5 వరకు పూర్తి చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
మరోవైపు ఇండిగో కూడా తన విమాన సర్వీసుల రద్దు గడువును పొడిగించింది. జెడ్డా, మదీనా నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను నవంబర్ 21 వరకు, రియాద్, దమ్మామ్ విమానాలను నవంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రాంతీయ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో భారత్-సౌదీ అరేబియా మధ్య ప్రయాణాలు చేయాలనుకునే ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్లలో ముందుగా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..
- కొత్తగూడెం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ !
- బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.
- ధోఫార్ మౌంటైన్స్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ..!!
- బహ్రెయిన్‌లో మనామా–ముహర్రఖ్ మధ్య రాకపోకలకు ఊరట..!!
- ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!
- అబుదాబి హోటల్లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!







