ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!

- November 14, 2026 , by Maagulf
ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!

న్యూయార్క్: గాజా స్ట్రిప్‌కు తక్షణమే, ఎలాంటి ఆంక్షలు లేకుండా మానవతా సహాయం అందించాలని ఖతార్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు పిలుపునిచ్చాయి. వింటర్ సమీపిస్తున్న నేపథ్యంలో గాజాలో షెల్టర్, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల సామాన్య ప్రజల ప్రాణాలకు మరింత ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీతో పాటు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన 53 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803లో పేర్కొన్న విధంగా గాజాలోకి పూర్తి స్థాయిలో, తక్షణమే మానవతా సహాయం చేరాల్సి ఉన్నప్పటికీ, ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని మూడు దేశాలు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. గాజాలో పెద్ద సంఖ్యలో ప్రజలకు సరైన షెల్టర్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వింటర్ కారణంగా హైపోథెర్మియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు.. రాజకీయ సంకల్పం ఉంటే గాజాలో మానవతా పరిస్థితులను మెరుగుపరచడం సాధ్యమేనని నిరూపించాయని పేర్కొన్నాయి. గాజాలోకి సహాయక సామగ్రిని వేగంగా చేరవేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని సరిహద్దు మార్గాలు, భూ మార్గాలను తెరిచి ఉంచాలని ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వాన్ని కోరాయి. 

ఇంధనం, తాగునీరు, పారిశుద్ధ్య పరికరాలు, వైద్య సామగ్రి, ఆశ్రయ నిర్మాణానికి అవసరమైన వస్తువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతించాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్‌లోని ఆసుపత్రులకు వైద్య చికిత్స కోసం రోగులను తరలించే ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరాయి. వైద్య సిబ్బంది, సహాయక కార్యకర్తలు, వైద్య కేంద్రాలకు మరింత రక్షణ కల్పించాలని స్పష్టం చేశాయి.

మానవతా సహాయక సిబ్బంది, వైద్య కార్యకర్తలపై జరిగిన దాడులపై పారదర్శక విచారణలు జరపాలని, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, జర్నలిస్టులు గాజాలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని మూడు దేశాలు డిమాండ్ చేశాయి. మానవతా సహాయాన్ని ప్రజలకు చేరవేయడంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం వంటి అంతర్జాతీయ సంస్థల పాత్ర అత్యంత కీలకమని మూడు దేశాలు స్పష్టం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com