ధోఫార్ మౌంటైన్స్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ..!!
- November 14, 2026
మస్కట్: ఒమన్‌లోని దక్షిణ ప్రాంతమైన ధోఫార్ మౌంటైన్స్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన 100 భౌగోళిక వారసత్వ ప్రదేశాల జాబితాలో ధోఫార్ మౌంటైన్స్ చోటు దక్కించుకున్నాయి.
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ (IUGS) విడుదల చేసిన మూడో విడత టాప్ 100 జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో ధోఫార్ ప్రాంతంలోని ‘కార్స్ట్ ల్యాండ్‌స్కేప్స్ అండ్ టుఫా డిపాజిట్స్’కు స్థానం కల్పించారు. జపాన్‌లోని మౌంట్ ఫుజీ, నార్వే ఫియోర్డ్స్, అమెరికాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత భౌగోళిక ప్రాంతాల సరసన ధోఫార్ నిలిచింది.
నవంబర్ 6న పోర్చుగల్‌లోని లూలేలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. 49 దేశాలకు చెందిన 156 మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా నిపుణులు పరిశీలించిన ప్రదేశాల్లో 47 దేశాలకు చెందిన ప్రాంతాలను ఎంపిక చేయగా, మధ్యప్రాచ్యం నుంచి ఎంపికైన ఆరు ప్రదేశాల్లో ధోఫార్ కూడా ఒకటిగా నిలిచింది.
నియోజీన్, క్వాటర్నరీ భౌగోళిక యుగాలకు చెందిన ధోఫార్ మౌంటైన్స్ భూమిపై భౌగోళిక మార్పులను అధ్యయనం చేయడానికి అరుదైన సహజ ప్రయోగశాలగా నిలుస్తున్నాయి. టెక్టానిక్ కదలికలు, వాతావరణ మార్పులు కలిసి ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని తీర్చిదిద్దాయి.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఏర్పడిన సమయంలో భూమి అంతర్భాగంలోని టెక్టానిక్ కదలికల కారణంగా పురాతన ప్రీకాంబ్రియన్ శిలలు, వాటిపై ఉన్న సున్నపురాయి పొరలు పైకి లేచి ఎత్తైన పీఠభూమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ పీఠభూమి దక్షిణ భాగంలో సముద్ర మట్టానికి 1,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న నిటారైన కొండచరియలుగా కనిపిస్తుంది. కొన్ని కొండచరియలు నేరుగా అరేబియా సముద్రంలోకి విస్తరించి ఉండగా, మరికొన్ని సలాలా చుట్టూ ఉన్న 20 కిలోమీటర్ల వెడల్పైన తీర మైదానానికి సరిహద్దులుగా ఉన్నాయి.
కాలక్రమంలో రుతుపవన వర్షాల ప్రభావంతో సున్నపురాయి కరిగి గుంతలు, లోతైన లోయలు, గుహలతో కూడిన ప్రత్యేక భౌగోళిక ప్రాంతం ఏర్పడింది. ధోఫార్ ప్రత్యేకతల్లో ప్రధానమైనవి కాల్షియం కార్బోనేట్ నిక్షేపాలతో ఏర్పడిన భారీ సహజ పాట్స్. ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఊట నీరు వేల సంవత్సరాలపాటు లోయల్లో ప్రవహిస్తూ ఈ సహజ నిర్మాణాలను సృష్టించింది.
వీటిలో వాడీ దర్బత్ సహజ ఆనకట్ట అత్యంత విశిష్టమైనది. ఇది సుమారు 800 మీటర్ల వెడల్పు, 100 మీటర్లకు పైగా ఎత్తుతో విస్తరించి ఉంది. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణానికి సమానమైనది మరొకటి లేదని IUGS తన నివేదికలో పేర్కొంది. మధ్య ప్లైస్టోసీన్ యుగంలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్మాణాలు ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని ధోఫార్ ప్రసిద్ధ ఖరీఫ్ సీజన్లో ప్రతి ఏడాది సందర్శకులను ఆకట్టుకుంటాయి.
గతంలో అరేబియా, ఆఫ్రికా భూఫలకాలు ఎలా విడిపోయాయనే అంశంపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వచ్చేవారు. ప్రస్తుతం గుహల్లోని ఖనిజ నిక్షేపాలు, టుఫా పొరలను పరిశీలిస్తూ గత కొన్ని లక్షల సంవత్సరాల్లో వాతావరణంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనలు దక్షిణ అరేబియాలో తొలి మానవులు ఎలా జీవించారు, వలసలు ఎలా సాగించారనే అంశాలను తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
ధోఫార్ పర్వతాల శాస్త్రీయ ప్రాముఖ్యతపై ఎర్త్ సైన్సెస్ కన్సల్టెన్సీ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ బిన్ హిలాల్ అల్ కిందీ మాట్లాడుతూ, ఒకే ప్రాంతంలో భూగర్భ కదలికలు, వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేసే అవకాశం ఇక్కడ ఉందని తెలిపారు. ఈ మౌంటైన్స్ భూవిజ్ఞాన శాస్త్రానికి సహజ ప్రయోగశాల వంటివని పేర్కొన్నారు. ఈ గుర్తింపు ఒమన్‌లో పర్యాటక రంగానికి, ముఖ్యంగా జియో టూరిజానికి మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.
తాజా వార్తలు
- బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.
- ధోఫార్ మౌంటైన్స్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు ..!!
- బహ్రెయిన్‌లో మనామా–ముహర్రఖ్ మధ్య రాకపోకలకు ఊరట..!!
- ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందించాలని ఖతార్ పిలుపు..!!
- అబుదాబి హోటల్లో ఘర్షణ.. 8 మందికి 6 నెలల జైలు..!!
- కువైట్‌లో ఆహార తయారీ కేంద్రాలపై PAFN దాడులు..!!
- దుబాయ్‌లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల నిఘా..ఒక్క నెలలో 27,756 ఉల్లంఘనలు గుర్తింపు
- ఫుజైరా రోడ్డు ప్రమాద మృతులకు యూఏఈలో సామూహిక అంత్యక్రియలు..
- హైదరాబాద్ కొత్త సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతల స్వీకరణ
- GMU మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వేల మందికి పైగా విద్యార్థులు







