బహ్రెయిన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు..!!
- November 14, 2026
మనామా: బహ్రెయిన్‌కు 161 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం సహజసిద్ధమైన సముద్ర సంపదగా ఉంది. పగడపు దిబ్బలు, సముద్రపు గడ్డి మైదానాలు, మడ అడవులు, డుగాంగ్‌లు (సముద్ర ఆవులు), వలస పక్షులతో ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. అయితే మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ సముద్ర పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. శాస్త్రీయ అధ్యయనాలు, ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం గత కొన్ని దశాబ్దాల్లో బహ్రెయిన్‌లో పగడపు దిబ్బల విస్తీర్ణం 5.1 శాతం తగ్గింది. మరోవైపు ఆల్గే (నాచు) పెరుగుదల 72 శాతం అధికమైంది. దీంతో పగడపు దిబ్బలు కప్పుకుపోయి, వాటిపై ఆధారపడే అక్రోపోరా వంటి సముద్ర జీవుల ఉనికికి ముప్పు ఏర్పడింది.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. చేపల వేటపై కఠిన ఆంక్షలు విధించడం, భారీ స్థాయిలో మడ అడవులను పెంచడం, సముద్ర రక్షిత ప్రాంతాలను విస్తరించడం, పర్యావరణ చట్టాలను కఠినతరం చేయడం వంటి చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా మడ అడవుల పునరుద్ధరణలో బహ్రెయిన్ గణనీయమైన పురోగతి సాధించింది. 2035 నాటికి 1.6 మిలియన్ మడ మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని దాదాపు తొమ్మిదేళ్ల ముందుగానే అధిగమించింది. 2026 మధ్య నాటికి 2.23 మిలియన్లకు పైగా మొక్కలు నాటింది. ఇది నిర్దేశిత లక్ష్యంలో 139 శాతానికి సమానంగా ఉంది.
అయితే వాతావరణ మార్పుల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సముద్రం అడుగున ఉన్న డీశాలినేషన్ ప్లాంట్ల నీటి సరఫరా పైపులకు ఫైబర్ ఆప్టిక్ అకౌస్టిక్ సెన్సర్లు, AI ఆధారిత వ్యవస్థలను అమర్చాలని ప్రతిపాదిస్తున్నారు. వీటి ద్వారా పైపుల్లో ఏర్పడే చిన్నపాటి లీకేజీలను కూడా వెంటనే గుర్తించవచ్చు. తద్వారా నీటి వృథాను అరికట్టడంతో పాటు డీశాలినేషన్ ప్లాంట్లపై ఒత్తిడిని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరచవచ్చు.
అలాగే బహ్రెయిన్ సంప్రదాయ వారసత్వంలో భాగమైన గుల్లల (Oyster) ఆవాసాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇవి సహజసిద్ధమైన నీటి శుద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి. ఒక్కో గుల్ల రోజుకు 50 గ్యాలన్ల వరకు సముద్రపు నీటిని వడపోసి, అదనపు నైట్రోజన్, మైక్రోప్లాస్టిక్స్, నీటిలోని మట్టి రేణువులను తొలగించగలవు. ప్రస్తుతం మడ అడవులు, కృత్రిమ పగడపు దిబ్బల పునరుద్ధరణపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, సముద్రపు గడ్డి మైదానాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహ్రెయిన్ తీరప్రాంతంలోని లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అంతరించిపోతున్న డుగాంగ్ల జనాభా ఉంది. వీటితో పాటు గ్రీన్ సీ తాబేళ్లు కూడా ఆహారం, జీవనానికి సముద్రపు గడ్డిపైనే ఆధారపడతాయన్నారు.
ఈ జీవులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు సముద్రపు గడ్డి పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. ఇందుకోసం సముద్రం అడుగున ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేసి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల స్థానిక గడ్డి జాతులను పెంచి, తవ్వకాలతో దెబ్బతిన్న తీరప్రాంతాల్లో తిరిగి నాటాలని ప్రతిపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు..!!
- ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!
- కువైట్‌లో వ్యవసాయ ఉత్పత్తి 12.65 శాతం తగ్గుదల..!!
- ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..







