ఒమన్‌లో OMR100 మిలియన్ల బాండ్ల జారీ..!!

- November 16, 2026 , by Maagulf
ఒమన్‌లో OMR100 మిలియన్ల బాండ్ల జారీ..!!

మస్కట్: ఒమన్ ప్రభుత్వం OMR100 మిలియన్ల విలువైన ప్రభుత్వ అభివృద్ధి బాండ్ల (Government Development Bonds) కొత్త విడతను జారీ చేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) ప్రకటించింది. ఈ బాండ్లపై ఏడాదికి 4.8 శాతం వడ్డీ చెల్లించనుండగా, వీటి కాలపరిమితి ఏడేళ్లుగా నిర్ణయించారు. ఈ బాండ్ల జారీ విలువను అవసరాన్ని బట్టి మరో OMR50 మిలియన్ల వరకు పెంచుకునే అవకాశం (Greenshoe Option) కూడా కల్పించారు. 

బాండ్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమై నవంబర్ 22వరకు కొనసాగుతుంది. నవంబర్ 23న వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 29న బాండ్లను జారీ చేస్తారు. ఈ బాండ్లపై వడ్డీని ప్రతి ఏడాది మే 29, నవంబర్ 29 తేదీల్లో ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. బాండ్ల గడువు నవంబర్ 29, 2033తో ముగుస్తుంది.

ఒమన్‌లోని వారితో పాటు విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు కూడా జాతీయతతో సంబంధం లేకుండా ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పోటీ బిడ్డింగ్ విధానం ద్వారానే బాండ్లను కేటాయిస్తారు. సబ్‌స్క్రిప్షన్ గడువులోగా ఒమన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాణిజ్య బ్యాంకుల ద్వారా బిడ్లు సమర్పించాలి. బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు దరఖాస్తు చేసుకునే తేదీకి కనీసం ఒక రోజు ముందుగా మస్కట్ క్లియరింగ్ అండ్ డిపాజిటరీ కంపెనీ వెబ్‌సైట్ లేదా 'Ashom Oman' యాప్ ద్వారా ఇన్వెస్టర్ నంబర్ పొందాలి.

బాండ్ల ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లలో పొందవచ్చు. ఆయా సంస్థల సోషల్ మీడియా ఖాతాల్లోనూ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బాండ్లకు ఒమన్ ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యక్షంగా, ఎలాంటి షరతులు లేకుండా హామీ ఇస్తుంది. వీటిని స్థానికంగా లైసెన్స్ పొందిన బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే మస్కట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (MSX)లో అప్పటి మార్కెట్ ధరల ప్రకారం కొనుగోలు, విక్రయాలు జరపవచ్చు.

బాండ్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను మస్కట్ క్లియరింగ్ అండ్ డిపాజిటరీ కంపెనీ నిర్వహించే ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. సబ్‌స్క్రిప్షన్ దరఖాస్తులో పేర్కొన్న బ్యాంకు ఖాతా నంబర్, మస్కట్ క్లియరింగ్ అండ్ డిపాజిటరీ కంపెనీ వద్ద నమోదైన ఖాతా నంబర్ ఒకటే అయి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. దీనివల్ల వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని గడువు తేదీల్లో సులభంగా పొందవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com